నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రణయ్ అనే దళిత యువకున్ని యువతి తండ్రి మారుతిరావు అత్యంత దారుణంగా మర్డర్ చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చివరకు ఈ హత్యతో సంబంధమున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ హత్య కేసు విచారణలో రాజకీయ కుట్రలు జరుగుతున్నట్లు టీజేఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు న్యాయవాది భరత్ కుమార్ లు తమను బెదిరించినట్లు బాధితులే ఆరోపిస్తున్నారని తెలంగాణ జన సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తెలిపారు. అయినా పోలీసులు వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దీంతోనే ఈ కేసులో రాజకీయ కుట్రలు జరిగినట్లు అనుమానం వస్తోందని తెలిపారు.

కేసీఆర్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని అంబటి మండిపడ్డారు. ప్రణయ్ హత్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని   డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసుపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని అంబటి శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ భార్య అమృతకు టీడీపి బంపర్ ఆఫర్

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

మారుతిరావును పోలీసులు ఎలా పట్టుకున్నారంటే (వీడియో)