ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోదండరాం మౌనదీక్ష.. అందుకే కేసీఆర్ రాష్ట్ర సమస్యలపై మాట్లాడటం లేదని ఫైర్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సోమవారం మౌన దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు, కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా సాధనే లక్ష్యంగా కోదండరాం ఈ దీక్షకు దిగారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సోమవారం మౌన దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు, కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా సాధనే లక్ష్యంగా కోదండరాం ఈ దీక్షకు దిగారు. పలువురు మద్దతుదారులతో కలిసి గంటపాటు దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ జలాల్లో రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని అన్నారు. వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఆంధ్రలో కూడా పోటీ చేయాలని చూస్తున్నారని.. అందుకే రాష్ట్ర సమస్యలపై పోరాటం చేయడంలేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. మంగళవారం (జనవరి 31) రోజున ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారని కోదండరాం ఇదివరకే చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తికావొస్తున్నా నేటికీ ఆస్తుల పంపకాలు, సంస్థల విభజన పూర్తికాలేదని అన్నారు.