హైదరాబాద్:  నిరుద్యోగుల, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జనసమితి చీఫ్ ప్రోఫెసర్ కోదండరామ్ ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో దీక్షను ప్రారంభించారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని  డిమాండ్ చేస్తూ ఇవాళ హైద్రాబాద్ లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో   తన పార్టీ కార్యాలయంలోనే  కోదండరామ్ దీక్షను ప్రారంభించారు. 48 గంటల పాటు కోదండరామ్ ఈ దీక్షను నిర్వహించనున్నారు. 

ఈ దీక్షకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే  ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 

టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడ ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు.