నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన విద్యార్థులకు బెయిల్ ఇచ్చిన పార్టీ నే ఇప్పుడు ఉద్యమిస్తే  భవిష్యత్తే ఉండదని హెచ్చరిస్తుంది.

తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రభుత్వ నిర్బంధాల మధ్య ఈ రోజు నిర్వహించిన నిరుద్యోగుల ర్యాలీ హైదరాబాద్ లో ఉద్రిక్తంగా మారింది.

వివిధ జిల్లా కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి 3 గంటలకే కోదండరాంను తర్నాకలోని ఆయన నివాసం అరెస్టు చేసిన పోలీసులు గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.

నిన్ననే 600 మంది టీ జేఏసీ నేతలను పోలులు అరెస్టు చేశారు.

ర్యాలీ నేపథ్యంలో ఉదయం నుంచే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

హాస్టల్స్ నుంచి గుంపుగా వెళుతున్న విద్యార్థులను ఓయూ లా కాలేజ్ వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో అక్కడ పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.

ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థులు రాళ్లురువ్వడంతో పోలీసులు లాఠీలు జులిపించారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి వ్యాన్లలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజాం కళాశాలలోనూ విద్యార్థులు తగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నినాదాలు చూస్తూ ముందుకు కదిలివస్తున్న ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇందిరాపార్కు నుంచి బాగ్‌లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు పోలీసులు ఆంక్షలు విధించడంతో పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాగా, ఈ ఘటనలపై జేఏసీ నేతలు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోదండరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.