కోదండరాంపై జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జేఏసీని కోదండరాం వన్ మ్యాన్ షోగా మార్చారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా తయారైన తెలంగాణ రాజకీయ జేఏసీలో కోదండరాం వన్ మెన్ షో గా వ్యవహరిస్తున్నారా.. ?

రాజకీయ మద్దతు కోసమే ఆయన పాకులాడుతున్నారా... ?

అవుననే అంటున్నారు టీజేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్.

నిరుద్యోగ నిరసన ర్యాలీ కి టీ జేఏసీ పిలుపునివ్వడం. ప్రభుత్వం దాన్ని ఉక్కు పాదంతో అణిచి వేసి జేఏసీ నేతలను అరెస్టు చేయడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ ఈ రోజు చర్చించింది. జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

కోదండరాంపై జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జేఏసీని కోదండరాం వన్ మ్యాన్ షోగా మార్చారని ధ్వజమెత్తారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. 

జేఏసీ ప్రజల మద్దతుకంటే రాజకీయ మద్దతుకే ఎక్కువగా పాకులాడుతోందని మండిపడ్డారు. కాగా, రవీందర్ వ్యాఖ్యలతో జేఏసీలోని ఇతరనేతలెవరూ ఏకభవించడం లేదు.

అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి విబేధాలు లేకుండా ముందుకు సాగిన జేఏసీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాస్త బలహీన పడింది.

జేఏసీలోని నేతలు వివిధ పార్టీల్లో చేరి రాజకీయంగా తమ భవిష్యత్తును వెతుక్కున్నారు.

2014 ఎన్నికల వేళ జేఏసీ తమ కు మద్దతు ఇవ్వడం లేదని కేసీఆర్ విమర్శలకు దిగారు. జేఏసీని బలహీన పరిచే చర్యలకు పాల్పడ్డారు. అయినా జేఏసీ లో ఎక్కడా విభేదాలు రాలేదు. ముఖ్యంగా కోదండరాంపై విమర్శలు రాలేదు. కానీ, ఇప్పుడు జేఏసీలో కీలకంగా ఉన్న వ్యక్తే కోదండరాంపై వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం.