పెద్దపల్లిలో వీధికుక్క దాడి: మూడేళ్ల చిన్నారికి గాయాలు
వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
కరీంనగర్: :వీధి కుక్క మూడేళ్ల బాలికతో పాటు మరో ముగ్గురిపై దాడి చేసి గాయపరిచిన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సోమవారంనాడు జరిగింది
ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికి రెడ్డి దిహాసిని అనే మూడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్క బాలికపై దాడి చేసింది. బాలిక ఎడమ చెంపపై తీవ్ర గాయమైంది. బాలికను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారితో పాటు మరో నలుగురిపై కుక్క దాడి చేసింది.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కలను చంపాలని మండల ప్రజలు కోరుతున్నారు.
గత నెల రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. కుక్క కాటుతో హైద్రాబాద్ నారాయణగూడలోని ఐపీఎం సెంటర్ కు బాధితులు క్యూ కడుతున్నారు.
హైద్రాబాద్ లో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. మరో వైపు జిల్లాల్లో కూడా వీధి కుక్కల బెడదను నివారించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.