కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు.. అలాంటి విషాదమే సంగారెడ్డిలో  జరిగింది. వేడివేడిగా తిన్న జొన్నరొట్టెలు వారి ప్రాణాల్ని తీశాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సోమవారం రాత్రి అయిదుగురు కుటుంబ సభ్యులు జొన్న రొట్టెలు తినగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే కుటుంబంలో 15 రోజుల క్రితం ఓ మహిళ మృతి చెందింది.

చనిపోకముందు ఆమె వాడిన జొన్నపిండినే కుటుంబ సభ్యులు వాడి, రొట్టెలు చేశారు. అవి తిన్న ఐదుగురు అస్వస్థతకు బారినపడి, ముగ్గురు చనిపోవడంతో.. జొన్నపిండిలోనే విషపదార్థం ఉండొచ్చని ఊహిస్తున్నారు.

అయితే జొన్న పిండిలోనే విష పదార్థం కలిసిందా, లేక పిండి చాలా రోజుల కిందటిదా? దానివల్ల ఫుడ్ పాయిజన్ అయిందా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.