హైద్రాబాద్ నార్సింగిలో డిటోనేటర్ పేలుడు: ముగ్గురికి గాయాలు
హైద్రాబాద్ నార్సింగిలో డిటోనేటర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది
హైదరాబాద్: నగరంలోని నార్సింగ్ లో బుధవారం నాడు డిటోనేటర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో డిటోనేటర్ పేలుడు చోటు చేసుకుంది. గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డిటోనేటర్ పేలుడుతో భారీగా శబ్దం వచ్చింది.ఈ శబ్దంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పప్పాలగూడ రెవిన్యూ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న నాలా నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారు. నాలా నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న బండరాళ్లను బద్దలు కొట్టేందుకు డిటోనేటర్లను ఉపయోగించారు. మూడు రోజుల క్రితం వినియోగించిన డిటోనేటర్లు కొన్ని పేలలేదు. ఇవాళ ఈ బండరాళ్లను తొలగిస్తున్న సమయంలో మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన డిటోనేటర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డిటోనేటర్ల పేలుడుతో బండరాళ్లు బాధితులకు తగిలాయి. దీంతో గాయపడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. డిటోనేటర్లు ఎన్ని పేలాయి,. పేలకుండా ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కాంట్రాక్టర్ పట్టించుకోలేదని ఇక్కడ పనిచేసే వారు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు.