Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నుంచి ముగ్గురికి, ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీలు.. ఎవరంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆరుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి కిన్నెర మెట్ల మొగులయ్య, సకిని రామచంద్రయ్య, గడ్డం పద్మజారెడ్డిలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ ఆదినారాయణ రావు, హసన్ సాహెబ్, గరికపాటి నరసింహారావులు ఉన్నారు. వారి వివరాలు..

Three from Telangana and three from AP are Padma Shri
Author
Hyderabad, First Published Jan 26, 2022, 8:22 AM IST

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆరుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి కిన్నెర మెట్ల మొగులయ్య, సకిని రామచంద్రయ్య, గడ్డం పద్మజారెడ్డిలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ ఆదినారాయణ రావు, హసన్ సాహెబ్, గరికపాటి నరసింహారావులు ఉన్నారు. వారి వివరాలు..

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగులయ్య నాగర్ కర్నూలు జిల్లా మండలం అవుసలి కుంటకు చెందిన వారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆకరితరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకుని జీవించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ట చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నా కళకు జీవం ఈ పురస్కారం..  మొగులయ్య
కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైనది. నాతోనే అది అంతమవుతుందా? అనే మనోవేదనతో ఉన్న సమయంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. దీని ద్వారా నా కళకు జీవం పోశారు. సీఎం కేసీఆర్ ఈ కళను గుర్తించి, పురస్కారం ఇవ్వడంతో అందరికీ తెలిసింది.

కోయదొరల ఇలవేల్పు కథకుడు 
కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆయన గిరిజన వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర డోలి సాయంతో కోయభాషలో అద్భుతంగా  వర్ణిస్తారు.  దాన్ని తెలుగులో పాటగా అందంగా మారుస్తారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సమయంలో అందరికీ గుర్తుకొస్తారు ఈయన. వనదేవతల  చరిత్ర వినాలి అనుకునే వారంతా ఈయన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటారు.  

కోయ భాషకు అక్షర రూపం తీసుకురావాలని  2015లో అప్పటి  భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్య ఆధ్వర్యంలో తోగ్గూడెంలో ఐదుగురు విశ్వవిద్యాలయాల ఆచార్య ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఇందులో సకినీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

పదనర్తనకు పద్మశ్రీ...
కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజా రెడ్డికి పద్మ పురస్కారం వరించింది. 1967 లో కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు ఆమె. తండ్రి జీవీ రెడ్డి వైద్యులు. తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి. ఆమె నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కేశ్ పల్లి (గడ్డం) గంగారెడ్డి చిన్న కోడలు. ఐదేళ్ల వయసులోనే నర్తకి శోభానాయుడు వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. ‘నృత్య విశారద, కల్కి కళాకార్, సంగీత నాటక అకాడమీ’ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్న వారిలో... 
పోలియో బాధితులను నడిపించారు…
పోలియో బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (82) విశాఖలో ప్రముఖ వైద్యుడిగా పేరు గడించారు. భీమవరానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. 1961-66లో ఏయూలో ఎంబిబిఎస్ పూర్తిచేశాక, అక్కడే ఆర్థోపెడిక్ సర్జరీలో ఎమ్మెస్ చేశారు.  జర్మనీలో శస్త్రచికిత్సలపై శిక్షణ పొందారు.

‘సర్జరీ ఆన్ పోలియో  డిజేబిలిటి’  పుస్తకం రాశారు. ఆదినారాయణ రావు  కేజీహెచ్లో  ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా, సూపర్డెంట్,  ఆంధ్ర  వైద్య కళాశాల ప్రిన్సిపాల్,  వైద్య విద్యా శాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఆయన సతీమణి డాక్టర్ శశి ప్రభ కేజీహెచ్ పర్యవేక్షకగా పని చేస్తున్నారు.

భద్రాద్రి రాముడికి నాదస్వర సుప్రభాత సేవకుడు…
కళాకారుడు హసన్ సాహెబ్ కు  పద్మశ్రీ

కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది.  ఆయన 93 ఏళ్ల వయసులో 2021 జూన్ లో మరణించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికి పుచ్చుకున్న హసన్.. కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం సంపాదించారు.  

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్ చిన మౌలానా,  ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్ చిన మౌలానా వద్ద శిక్షణ పొంది, 1954లో ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసులుగా చేరారు. 1981లో  భద్రాచలం ఆలయంలో నియమితులయ్యారు. నాదస్వర సుప్రభాతసేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలు అందించారు.  యాదాద్రి ఆలయంలోనూ  పని చేశారు.

అవధాన ఘనాపాటి.. గరికపాటి..
అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకట సూర్యనారాయణ, రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబరు 14న జన్మించిన నరసింహారావు ఎంఏ, పీహెచ్ డీ పట్టాలు పొందారు. 30 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భార్య శారదది తూర్పుగోదావరి జిల్లా. తెలుగు భాష ఉచ్చారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. 

కాకినాడలో స్నేహితులతో మొదట స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్ కాలేజీని స్థాపించారు. తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్ కళాశాల నెలకొల్పారు. చైతన్య కళాశాలలో తెలుగు, సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 275 అష్టావధానాలు అవలీలగా నిర్వహించారు గరికిపాటి. ఆయన ‘సాగరఘోష’ అనే పుస్తకాన్ని రచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios