హైదరాబాద్: తెలంగాణలోని మేడ్చెల్ జిల్లా జవహర్ నగర్ లో మర్రిచెట్టుకు వేలాడుతూ కనిపించిన యువతుల మృతదేహాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వారిని కరీంనగర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వారిని సుమతి, రేవతి, అనూషలుగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా వారు హైదరాబాదు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

వారు హైదరాబాదులోని ఓ పాస్టర్ వద్దకు ఈ నెల 9వ తేదీన వచ్చిననట్లు, ఓ పాస్టర్ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు మర్రిచెట్టు వద్దకు వచ్చినట్లు చెప్పారు. అక్కడ పాపకు కూల్ డ్రింకులో హార్పిక్ కలిపి తాగించినట్లు, పాప మరణించిన తర్వాత వారిద్దరు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది తెలియడం లేదు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మేడ్చెల్ జిల్లా జవహర్ నగర్ లో ఒకే చోటు పోలీసులకు మూడు శవాలు కనిపించిన విషయం తెలిసిందే. జవహర్ నగర్ లోని డెంటల్ కాలేజీ డింపింగ్ యార్డు వద్ద మర్రిచెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి. ఆ పక్కనే చెట్టు కింద మరో చిన్నారి మృతదేహం కనిపించింది. 

వారిది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన సెల్ ఫోన్ల ఆధారంగా వారి వివరాలు సేకరిస్తున్నారు.