జైన తీర్థంకరులకు చెందిన శిల్పాలు హైదరాబాద్ శివారుల్లో బయటపడ్డాయి. వీటిలో రెండు స్తంభాలు, ఒకటి గ్రానైట్‌తో, మరొకటి బ్లాక్ బసాల్ట్‌తో కూడిన నాలుగు జైన తీర్థంకరులు వాటి మీద ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త శివనాగి రెడ్డి వివరించారు.

హైదరాబాద్ : హైదరాబాద్ శివారుల్లో 9-10వ శతాబ్దాల కాలంనాటి జైన మఠానికి సంబంధించిన ఆధారాలతో ఉన్న జైన తీర్థంకర శిల్పాలు, శాసనాలతో కూడిన రెండు చతురస్రాకార స్తంభాలు వెలుగు చూశాయి. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఒక గ్రామంలో ఇవి బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రవేత్త, హెరిటేజ్ యాక్టివిస్ట్ పి.శ్రీనాథ్ రెడ్డి అందించిన సమాచారం మేరకు ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, మాజీ ప్రభుత్వ అధికారి అయిన ఇ.శివనాగి రెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామాన్ని పరిశీలించారు.

దీనికి సంబంధించి పీటీఐ నివేదిక ప్రకారం, శివనాగి రెడ్డి తన పరిశోధనలో రెండు స్తంభాలు కనుగొన్నారు. వీటిలో ఒకటి గ్రానైట్‌తో, మరొకటి బ్లాక్ బసాల్ట్‌తో ఉంది. వీటిమీద నాలుగు జైన తీర్థంకరులు.. ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరుల విగ్రహాలున్నాయి. ఒక్కొక్కటి ధ్యాన భంగిమలో చిత్రీకరించబడిందని వివరించారు. స్తంభాల పైభాగంలో 'కీర్తిముఖాలు' అలంకరించబడ్డాయి.

ఈటల హత్యకు సుఫారీ ఆరోపణలు: రాజేందర్‌తో భేటీ కానున్న మేడ్చల్ డీసీపీ

వీటి ఉపరితలంలో తెలుగు-కన్నడ లిపిలో శాసనాలు ఉన్నాయి, అయితే అవి గ్రామ ట్యాంక్ తూము రాతి గోడలలో కలిసిపోవడంతో.. వాటిని తొలగించకుండా ఏం రాసి ఉందో అర్థం చేసుకోలేం. శాసనంలోని బైటికి కనిపిస్తున్న దాంట్లో చిలుకూరు గ్రామానికి సమీపంలో ఉన్న 'జనిన బసది' (మఠం)ను సూచిస్తుంది. ఇది రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో (9వ-10వ శతాబ్దాలు) ప్రముఖ జైన కేంద్రంగా ఉంది.

తూము నుంచి స్లాబ్‌లను వెలికితీసిన తర్వాతే పూర్తి వివరాలు గుర్తించగలమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. పిటిఐతో మాట్లాడుతూ, "దీన్ని బట్టి చిలుకూరు సమీపంలో సుమారు 1,000 సంవత్సరాల క్రితం జైన మఠం ఉనికిలో ఉందని ధృవీకరించగలం" అని ఆయన ధృవీకరించారు.

ఈ జైన తీర్థంకర స్లాబ్‌లను స్థానికంగా ఉన్న శిథిలమైన జైన దేవాలయం నుండి తీసుకువచ్చి దాదాపు శతాబ్దం క్రితం ఈ నిర్మాణంలో వాడరని శివనాగి రెడ్డి అన్నారు. జైన శిల్ప స్తంభాలు, శాసనాల పురావస్తు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శివనాగి రెడ్డి వాటిని తూము నుండి తొలగించి, తగిన లేబులింగ్, చారిత్రక సమాచారంతో ఒక పీఠంపై వాటిని ఏర్పాటు చేయడం ద్వారా వాటిని రక్షించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

కాగా, యాదాద్రి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో జైనమత పుణ్యక్షేత్రం ఉంది. హైదరాబాదు నుండి సుమారు 77 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు.