ఆరోజు సాయంత్రం నాలుగున్నర అయింది సమయం. విజిటర్స్ తాకిడి కూడా సచివాయలానికి తగ్గిపోతున్న వేళ అది. అప్పుడే తెలంగాణ సచివాలయం ముందుకు ఒక ఆటో వచ్చింది. ఆ ఆటోలో ఒక విఐపితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆటోను లోపలికి అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరాడు ఆ విఐపి. కానీ సెక్యూరిటీ వాళ్లో నో అన్నారు. ససేమిరా కుదరదు అన్నారు. తాను ఎమ్మెల్యను అని చెప్పినా వినిపించుకోలేదు. ఆటోలో వచ్చినవు నువ్వు అసలు ఎమ్మెల్యేవేనా? రుజువులేంది అని అడిగిర్రు. ఆయన తన వద్ద ఉన్న అసెంబ్లీ ఐడి కార్డు చూపిండు. కానీ వాళ్లు నమ్మలేదు. ఇది నిజమైన ఐడి కార్డేనా అని మళ్లీ నిలదీసిర్రు. అయినా ఎమ్మెల్యే అయితే కారు లేదు, గన్ మెన్లు లేరు అని మళ్లీ ప్రశ్నించిర్రు ఆ సెక్యూరిటీ వాళ్లు. ఎంతసేపటికీ వెళ్లనీయలేదు. దాదాపు 25 నిమిషాల పాటు తర్జన భర్జన జరిగింది. తర్వాత అటువైపు వస్తున్న మీడియా వారు ఆ విఐపిని గుర్తు పట్టి అసలు విషయం సెక్యూరిటీ వాళ్లకు చెబితే అప్పుడు లోపలికి అనుమతించిర్రు. ఆయన ఎవరో కాదు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.

ఎమ్మెల్యే సున్నం రాజయ్య సచివాలయం లోపలికి వెళ్లిన తర్వాత ఆ సెక్యూరిటీ వాళ్లకు ఒకటే భయం. తమ మీద ఎక్కడ అసెంబ్లీ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారేమో? ఎమ్మెల్యేను గుర్తించకుండా, ఐడి కార్డు చూపినా సచివాలయంలోపలికి అనుమతించకపోవడంతో తమపై ఎక్కడ సస్పెన్షన్ వేటు పడుతుందోమేనని ఆందోళన చెందారు. కానీ సున్నం రాజయ్య తర్వాత మీడియాతో మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేసి వాళ్ల పొట్ట కొడితే నాకేమొస్తది అని వ్యాఖ్యనించారు. అంతసేపు తనని ఆపినా సరే వాళ్లమీద తనకు ఏమాత్రం కోపం లేదని చెప్పడం అంటే ఆయనలోని గొప్పతనం అర్థమైందని పలువురు జర్నలిస్టులు అభినందించారు.

భద్రాచలం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్య ఇప్పటికీ సొంత కారు లేదంటే చాలా మంది నమ్మలేరు. కానీ వాస్తవం. ఆయనకు ఎమ్మెల్యేగా వచ్చే జీతం సుమారు రెండున్నర లక్షలలో సగం వేతనం తన పార్టీ సిపిఎం కి విరాళం ఇస్తారు. మిగతా సగంలో ఆయన తన ఖర్చులకు వాడుకుంటారు. ఆయన తన నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలో కానీ, బైక్ మీద వెనకాల కూర్చుని కానీ వెళ్తారు. ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలో భద్రాచలంలో ఆర్టీసి బస్సు ఎక్కి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో అసెంబ్లీకి వెళ్లాలంటే అసెంబ్లీ వారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన బస్సు ఎక్కి అసెంబ్లీకి వస్తారు. బహుషా అసెంబ్లీకి ప్రభుత్వ బస్సులో ఎక్కి వచ్చే ఎమ్మెల్యే తెలంగాణ లో ఆయన ఒక్కరే ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇక హైదరాబాద్ లో ఎక్కడ తిరగాలన్నా ఆటో ఎక్కాల్సిందే. ఇలాంటి ప్రజా నాయకులు దేశం మొత్తంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో కదా? మీరు గ్రేట్ సున్నం రాజయ్య గారూ....