ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం పరామర్శ కోసం వచ్చా. తొందర్లోనే చింతమడకలో సభ పెట్టి కేసీఆర్ బండారాన్ని బయటపెడతా

మొత్తానికి తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వగ్రామం చింతమడక చేరుకున్నారు. వూర్లోకి ప్రవేశించలేకపోయాడు. అయితే, తొందర్లో కెసిఆర్ సొంత వూర్లో కాలుమోపుతా, సభ పెడతా అని ప్రకటించాడు.
సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిం చారు.టిడిపి నాయకుడు కెసిఆర్ సొంతవూరికొచ్చి రైతు ఆత్మహత్యను రాజకీయం చేయడం టిఆర్ ఎస్ వారికి నచ్చలేదు. అంతే, చింతమడక చేరుకోకుండా అడుగడుగునా ఆటంకాలు ఎదురైనాయి. నిన్న సాయంకాలం 4 గంటల ప్రాంతం లో సిద్దిపేటకు చేరుకోగానే ముస్తాబాద్ చౌరస్తా వద్ద సిద్దిపేట ఎసీపీ నరసింహ్మారెడ్డితో బలగంతో వచ్చి అడ్డుకున్నారు. చింతమడక పర్యటనకు అనుమతి లేదుకాబట్టి వెళ్లడానికి వీళ్లేదని రేవంత్ కాన్వాయ్ ను నిలిపివేశారు.
రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసుల అనుమతి ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఇక్కడ వాగ్వాదం దాదాపు 40 నిమిషాలపాటు ఉద్రిక్త వాతావరణంలో సాగింది. చివరకు , నిలిపేయడం కంటే, వూర్లోకి అనుమతించడమే మంచిదని పోలీసులు గ్రహించారు. కాన్వాయ్ ని అనుమతించారు.
రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వెలుతుండగా మార్గమధ్యంలో రాఘవాపూర్, బబ్చాయిపల్లి ,లక్ష్మిదేవిపల్లి గ్రామాల వద్ద ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. వాళ్లను దాటుకుని చింతమడక సమీపించాక కూడా ఆటంకాలు ఆగిపోలేదు.
రేవంత్‌రెడ్డిని రానివ్వమని అడ్డుకో వడంతోవ పాటు రేవంత్‌రెడ్డి గోబ్యాక్ అంటూ అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. దీంతో గ్రామంబయటే రేవంత్‌రెడ్డి భైఠాయించాల్సి వచ్చింది. దీంతో ఆత్మహత్య చేసుకున్ననాగమణి కుటుంబ సభ్యులను ఏసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామశివారులో ఉన్న రేవంత్ వద్దకు తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి అందిస్తానన్న యాభై వేల ఆర్థిక సహాయం వారు తీసుకోలేదు. తమను మంత్రి హరీష్ ఆదుకుంటారని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా ఇతర గ్రామాల నుంచి ప్రజలను రప్పించి తన పర్యటన అడ్డుకోవడం రాజకీయం చేయడం కాదా అన్నారు. ప్రస్తుతం పరామర్శ కోసం వచ్చానని త్వరలోనే చింతమడకలో సభ పెట్టి కేసీఆర్ బండారాన్ని బయటపెడతానని రేవంత్ ప్రకటించారు. అనుమతి లేవని పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు.
