అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారు.. అరెస్టు చట్ట విరుద్ధం - కల్వకుంట్ల కవిత
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదే పదే అడుగుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన అరెస్టు ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఆమెను 26వ తేదీ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని పొడగించింది. అయితే వాస్తవానికి కవితను 5 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని ఈడీ కోరింది. కానీ దానికి నిరాకరించింది. మూడు రోజులు మాత్రమే ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఢిల్లీలోని కోర్టు అవెన్యూ కోర్టుకు వెళ్లే ముందు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది రాజకీయ కేసు, కల్పిత కేసు. ఇది తప్పుడు కేసు. దీనిపై పోరాడుతున్నాం. ఈడీ అధికారులు పదే పదే అవే ప్రశ్నలను అడుగుతున్నారు.’’ అని ఆమె తెలిపారు. కాగా.. దేశ రాజధానిలో మద్యం లైసెన్సుల్లో భారీ వాటాకు ప్రతిఫలంగా ఆప్ కు రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'సౌత్ గ్రూప్'లో కల్వకుంట్ల కవిత కీలక సభ్యురాలు అని ఈడీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవిత బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ, హైద్రాబాద్ లో సోదాలు చేపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, హైద్రాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో జరుపుతున్నారు. హైదరాబాదులోని ఆమె మేనల్లుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.
కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెను ఈ నెల 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆమె నివాసంలో సోదాలు జరిపింది. మరుసటి రోజు ఆమెను ప్రత్యేక పిఎంఎల్ఎ కోర్టులో హాజరుపరచగా, మార్చి 23 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీ విధించింది. అయితే దానిని సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. తరువాత సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. అయితే ఈడీ బలవంతపు చర్యల నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే సీఎం అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టును దేశంలోని విపక్ష పార్టీలు ఖండించాయి.