బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత తీగల కృష్ణారెడ్డి పార్టీ మారుతున్నారు. ఆయన హస్తం గూటికి రానున్నారు. మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిలతో ఆయన తాజాగా సమావేశం అయ్యారు. త్వరలోనే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ అనితారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుంది. కాంగ్రెస్ అనుకున్నట్టే అధికార పార్టీ నుంచి వలసలు వస్తున్నాయి. తాజాగా, బీఆర్ఎస్‌కు చెందిన మరో కీలక నేత తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో ఆయన సమావేశం కావడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. త్వరలోనే ఆయన తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి పార్టీలో ఆధిపత్య పోరు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి సబితా ఇంద్రా రెడ్డి ఈయనపై విజయం సాధించారు. అనంతరం, ఆమె బీఆర్ఎస్‌లోకి చేరారు. ఆమెకు కేసీఆర్ మంత్రిపదవి కూడా అప్పగించారు. కానీ, తీగల కృష్ణారెడ్డికి బీఆర్ఎస్‌లో ప్రాధాన్యత తగ్గుతున్నదని ఆయన కలవరపడుతున్నారు. వీరిద్దరూ మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేసిన నేతలు.
Also Read: ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ సమీపంలో నగ్న నిరసనలు.. షాకింగ్ వీడియోలు వైరల్
అదీగాక, సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తామని కేసీఆర్ పలుమార్లు ప్రకటించడం కూడా తీగల కృష్ణారెడ్డిలో ఆందోళన పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవచ్చనే అనుమానాలు ఉన్నాయి. దీంతో పార్టీ మారడమే ఉత్తమమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంలోనే ఆయన మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. త్వరలోనే ఆయన, కోడలు అనితారెడ్డిలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
