హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికా కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ చైర్మన్ దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీరెడ్డి బిజెపిలో చేరడం వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె బిజెపిలో చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. కాంగ్రెసులో కీలక నేతగా వ్యవహరిస్తున్న దామోదర భార్య బిజెపిలో చేరడమేమిటని ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయింది.

బిజెపిలో చేరేందుకు ఆమె కొద్ది రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో స్వామి పరిపూర్ణానంద బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. బిజెపిలో ఆయన కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడి అమిత్ షా సమావేశమయ్యారని భావించారు. కానీ, ఆ భేటీ వెనక మరింత కథ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని తన శిష్యులు కొంత మంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పరిపూర్ణానంద అమిత్ షా చెప్పారని వినికిడి. బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్న తన శిష్యుల పేర్లతో కూడిన జాబితాను ఆయన అమిత్ షాకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ జాబితాలో పద్మినిరెడ్డి పేరుందని సమాచారం.

పద్మినిరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు అమిత్ షా సుముఖత వ్యక్తం చేశారని, దాంతో ఆమె వెంటనే బిజెపిలో చేరారని అంటున్నారు. ఆమె సంగారెడ్డి నుంచి గానీ మెదక్ నుంచి బిజెపి తరఫున శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది.

గతంలో రెండు పర్యాయాలు ఆమె రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించారని అంటారు. దామోదర రాజనరసింహకు ఆందోల్ టికెట్ కేటాయించడంతో ఆమెకు సంగారెడ్డి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జగ్గారెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డిని కాదని ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో సంగారెడ్డి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న ఆమె బిజెపిలో చేరినట్లు చెబుతున్నారు.  అవకాశం ఇస్తే తాను సంగారెడ్డి నుంచి పోటీ చేస్తానని పద్మినీ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అందుకే దామోదర భార్య బీజేపీలోకి: హరీష్ సెటైర్లు

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: దామోదర భార్య పద్మిని రెడ్డి

ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య