శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎండీ, డాక్టర్ రవీంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.... ఆయన ఆత్మహత్య వెనుక కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఉన్న మనస్పర్థల కారణంగానే రవీంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిందని... ఆ బాధతోనే ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Also Read శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండీ డాక్టర్ రవీందర్‌ ఆత్మహత్య...

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ రవీంద్రకుమార్ (42) దుమ్మాయిగూడోలని శ్రీ ఆదిత్య హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య స్మిత(36) కూడా డాక్టర్ కావడం గమనార్హం. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆదిత్య(10) అనే కుమారుడు కూడా ఉన్నాడు. 

దంపతులు కాప్రా పరిధిలోని సాకేత్ లో ఒక విల్లాలో ఉంటున్నారు. ఇద్దరూ వైద్యులు కావడంతో కుమారుడి పేరుతో హాస్పిటల్ నిర్మించుకున్నారు. అందులో స్మిత గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తుండగా.. రవీంద్ర కుమార్ ఎండీగా కొనసాగుతున్నారు.

సోమవారం ఉదయం ఆస్పత్రిలో పలు ఆపరేషన్‌లు చేయాల్సి ఉండడంతో అనస్తీషియా ఇవ్వడం కోసం డాక్టర్‌ రవీంద్ర కుమార్‌కు ఆస్పత్రి సిబ్బంది ఫోన్‌చేశారు. అయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వప్న అనే ఉద్యోగి.. డాక్టర్‌ ఇంటికి వెళ్లారు. 

అక్కడ తన పడగ్గదిలో మంచంపై రక్తపుమడుగులో పడి ఉన్న రవీంద్రకుమార్‌ను చూసిన స్వప్న వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అయితే.. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు కూడా దంపతులిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో స్మిత.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. చనిపోవడానికి ముందు భార్యకి ఫోన్ చేసి.. కొడుకుతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. కొడుకుతో మాట్లాడిన తర్వాతే ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.