సానుభూతి కోసమే కాల్పుల డ్రామా అంటున్న పోలీసులు అప్పుల బాధల ఉపశమనం కోసమే ఈ హంగామా చిక్కు ముడి విప్పిన పోలీసులు విక్రం కుటుంబంపై కొత్త కేసులు పెట్టే చాన్స్,
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన విక్రం గౌడ్ కాల్పుల ఘటన రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా విక్రం గౌడ్ కాల్పులు ఒక డ్రామా అన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. విక్రం గౌడ్ మనుషులే ఆయనను అండర్ స్టాండింగ్ తోనే కాల్చారన్నది పోలీసులు చెబుతున్న తాజా మాట. కానీ అసలు విక్రం గౌడ్ కాల్పుల డ్రామా ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు కాల్పుల సీన్ క్రియేట్ చేశారన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇటీవల కాల్పుల్లో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. ముందుగా ఆయనను కొందరు దుండగులు అర్థరాత్రి సమయంలో ఇంటికొచ్చి కాల్చి వెళ్లిపోయారని విక్రం, ఆయన సతీమణి షిపాలి ఇద్దరూ చెప్పారు. తర్వాత పోలీసులు విచారణ వేగవంతం చేసేకొద్దీ విక్రమ్ మాత్రమే కాల్చుకున్నాడన్న అనుమానం పోలీసులకు కలిగింది. అయితే తాజాగా ముగ్గురు వ్యక్తులు విక్రం ను కాల్చి పారిపోయారని తాజాగా పోలీసులు అంచనాకు వచ్చారు. కాల్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో విక్రం గౌడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో డబ్బు భారీగానే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఆయనతోపాటు మరికొందరు అభ్యర్థులకు కూడా విక్రం చేతినుంచి పెద్ద మొత్తంలో ఖర్చులు డబ్బు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ఎన్నకల్లో విక్రంతోపాటు ఆయన మనుషులంతా ఓటమిపాలయ్యారు. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అప్పల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఈ కాల్పుల డ్రామాకు తెర లేపినట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకోసమే విక్రం తన మనుషులతో కాల్పించుకుని సీన్ క్రియేట్ చేశారని చెబుతున్నారు. కేవలం జనాల్లో సానుభూతి రావడంతోపాటు బాకీదారుల వత్తిళ్లు తగ్గుతాయన్న ఉద్దేశంతో ముందస్తు ప్లాన్ ప్రకారమే కాల్పుల వ్యవహారం చేశారని అంటున్నారు.
మరిన్ని ఆధారాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్చిన వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు కాల్చిన తుపాకీని ఎక్కడ పడేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి విక్రం గౌడ్ వేసిన స్కెచ్ బూమరాంగ్ అయిందని చెబుతున్నారు పోలీసులు. సానుభూతి రాకపోగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసు, వాటిని ఫైర్ చేసిన కేసుతోపాటు సాక్ష్యాల తారుమారు చేసిన కేసులాంటివి అనేకం విక్రంతోపాటు ఆయన సతీమణి షిపాలి కి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం పోలీసు వర్గాల నుంచి జరుగుతోంది.
