అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో చూశాం: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.అహంకారం ఉంటే ఏమౌతుందో తెలంగాణలో చూశామని ఆయన చెప్పారు.రాష్ట్రంలో కూడ జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందన్నారు.
తాను 45 ఏళ్లుగా తాను ఏ ఒక్క తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తప్పు చేయకున్నా నన్ను జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెలిపారు.
తుఫాన్ వల్ల ఎకరాకు రైతులు రూ. 50 వేలు నష్టపోయారన్నారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడ ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైల్లో పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
తుఫాన్ వస్తుందని తెలిసి కూడ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టని కారణంగా అధిక నష్టం సంబవించిందని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ సర్కార్ పరిహారం ఇవ్వకపోతే 3 నెలల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను పరిహరం అందిస్తామన్నారు. కౌలు రైతులకు సైతం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబును కూడ ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాలేదు. కానీ, సోషల్ మీడియాగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
also read:మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇద్దరు సీఎంలు: నాడు బూర్గుల, నేడు రేవంత్ రెడ్డి
తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని దక్కించుకుంది. ఈ దఫా మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించారు.
.