Asianet News TeluguAsianet News Telugu

జేఈఈ అడ్వాన్స్డ్ లో ర్యాంకుల మోత మోగించిన తెలుగు విద్యార్థులు..

ఐఐటిలో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు వచ్చాయి. వీటిల్లో కామన్ ర్యాంకులతో పాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు.

Telugu students who scored high ranks in JEE Advanced
Author
First Published Sep 12, 2022, 9:26 AM IST

అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ము లేపారు. ఏపీ, తెలంగాణ నుంచి  దాదాపు 30వేల మంది విద్యార్థులు హాజరు కాగా, అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200 లోపు  48 మంది,  300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో వందమందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్డ్ ను నిర్వహించిన ఐఐటీ-బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. 

కామన్ ర్యాంకులతో పాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీ సాయి రోహిత్ రెడ్డి  రెండవ ర్యాంకు..  వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వ్ డ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్ సీఎల్, జనరల్ ఈ డబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు.

కాగా ఐఐటీ-బాంబే జోన్ లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్  డ్ లో 360 మార్కులకు గానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్ లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్ గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం)నిలిచింది. ఈమెకు అడ్వాన్స్ డ్ లో 277 మార్కులు వచ్చాయి. 

26.17 శాతం మందికే అర్హత మార్కులు...
జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిని ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28శాతం) మంది, అమ్మాయిల్లో 33,608మందిలో 6,516 (19.38శాతం)మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392మందిలో 375మంది, విదేశీ విద్యార్థుల్లో 280మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. 

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్...
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటి (జోసా)సోమవారం నుంచి ఐఐటీలు, ఎస్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేశారు. 

మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. 
ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజర్వేషన్లు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23, 994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 635, జీఎఫ్టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios