రెండు శిబిరాలకూ దూరంగా బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ.. ఎవరి లెక్కలు వారికున్నాయిగా..!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇటు ఎన్డీయే కూటమి భేటీ, అటు విపక్షాల సమావేశంలోనూ పాల్గొనడం లేదు. ఈ రెండు పక్షాల భేటీలకూ వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నాయి. ఇందుకు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.

ఈ రెండు రోజుల్లో 2024 ఎన్నికలకు సంబంధించిన కీలక విషయాలపై అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షాలు చర్చ చేస్తున్నాయి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే సమావేశాలివి. బెంగళూరులో కాంగ్రెస్ సారథ్యంలో ఈ రోజు మొదలైన ప్రతిపక్షాల సమావేశం రేపు కూడా కొనసాగనుంది. రేపు ఢిల్లీలో ప్రధాని మోడీ సారథ్యంలో ఎన్డీయే పార్టీల భేటీ జరుగుతున్నది. దాదాపు దేశంలోని అన్ని పార్టీలు అయితే ఎన్డీయే కూటమి సమావేశానికి లేదా ప్రతిపక్షాల భేటీకి హాజరవుతున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం ఉన్నది. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలు ఈ రెండు సమావేశాలకు హాజరు కావడం లేదు.
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఈ సమావేశాలకు జాతీయ రాజకీయాలు చేస్తామని బయల్దేరిన బీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. బీజేపీ కేంద్రప్రభుత్వానికి అన్నివేళలా సహకరించే వైసీపీ, రెండు పక్షాలతోనూ చేతులు కలిపిన చరిత్ర కలిగిన టీడీపీ ఈ రెండు శిబిరాల సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇది బయటకు కనిపించే విషయం. కానీ, ఈ మూడు పార్టీలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తక్కువైతే బీజేపీకి సహకరించడానికి ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ జరుగుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అనే అనుమానాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. లిక్కర్ కేసు మొదలు పలు నిర్ణయాలు, వ్యవహారాలు బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతున్నదనే అనుమానాలకు బలాన్నిచ్చాయి. దీంతో బీజేపీకి వీలైనంత దూరంగా ఉండాలని లేదా ఉన్నట్టు కనిపించాలని బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నది. ఎన్నికలు సమీపించిన వేళ ఇది బీఆర్ఎస్‌కు అవసరం. లేదంటే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకునే అవకాశం ఉన్నది. అదీగాక, లిక్కర్ కేసు వంటి అంశాలు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య సానుకూల వాతావరణానికి అవకాశం కల్పించిందని చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ బలంగా గొంతెత్తడానికి ఇలాంటి విషయాలు అడ్డుపడుతున్నాయనీ, విపక్ష శిబిరంలో చేరకుండా అడ్డుకుంటున్నాయనీ మరో వాదన ఉన్నది.
అలాగే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ చేతులు కలిపే అవకాశమే లేదు. ముందు నుంచి బీజేపీతోనైనా కాస్త మెత్తగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో మాత్రం సానుకూలంగా వ్యవహరించన దాఖలాలు లేవు.
Also Read: కుమారస్వామిపై కేసిఆర్ దెబ్బ: వైఎస్ జగన్, ఓవైసీల మీదా అదే వైఖరి
కేంద్రంలోని బీజేపీకి, వైసీపీకి మంచి అండస్టాండింగ్ ఉందనేది పొలిటికల్ సర్కిల్‌లో జరిగే చర్చే. కేంద్రంలో బీజేపీకి ఆపదవస్తే వైసీపీ.. ఏపీలో ఇబ్బందిపడితే వైసీపీకి బీజేపీ సహాయపడుతుందని వాదిస్తున్నారు. జగన్ పై కేసులు, వివేకా కేసు సహా పలు సమస్యల్లో బీజేపీ పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందని టాక్. విపక్ష శిబిరంలో కలిసి వైసీపీ ఈ సమస్యను మీదికి తెచ్చుకోలేదు. అదీగాక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి కూటమికి బయటి నుంచి మద్దతు ఇవ్వడమే శ్రేయస్కరం అని వైసీపీ భావిస్తున్నది.
ఆ సమావేశాలకు కావాలంటే హాజరు అయ్యే దారులు పై రెండు పార్టీలకు ఉన్నాయి. కానీ, టీడీపీ మాత్రం రెంటికి చెడిన రేవడి పరిస్థితిలో ఉన్నది. టీడీపీ ఇటు కాంగ్రెస్‌తో అటు బీజేపీతోనూ చేతులు కలిపి దూరమైన చరిత్ర కలిగి ఉన్నది. అంతేకాదు, విమర్శలూ ఎక్కుపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. వైసీపీని గద్దె దించడానికి బీజేపీతో చేతులు కలపాలని టీడీపీ హస్తం అందిస్తున్నది. కానీ, బీజేపీ ఆసక్తి చూపడం లేదు.