Asianet News TeluguAsianet News Telugu

యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాలు విడుదల.. నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు.. మెరిసిన తెలుగు తేజాలు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. 

telugu candidates performance in UPSC civils exams 2022 ksm
Author
First Published May 23, 2023, 2:49 PM IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.  ఈ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. తెలుగు తేజం నూకల ఉమా హారతి సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె.  ఉమా హారతి తన నాలుగో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించారు. 

తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్‌ దత్తాకు 22వ ర్యాంకు సాధించారు. ఇక,  శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, శివమారుతిరెడ్డి 13వ ర్యాంకు, వసంత్ కుమార్ ఆర్ 157వ ర్యాంకు, కమతం మహేష్ కుమార్ 200, ఆర్ జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బీ ఉమహేశ్వరరెడ్డి 270వ ర్యాంకు, చల్లా  కల్యాణి 285 ర్యాంకు, పీ విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, జీ సాయికృష్ణ 293వ ర్యాంకు, లక్ష్మి సుజిత 311, ఎన్ చేతనా రెడ్డి 346,  శృతి యారగంటి ఎస్ 362వ ర్యాంకు, వై సుష్మిత 384వ ర్యాంకు సాధించారు. 

ఇక, సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులను మహిళ అభ్యర్థులే కైవసం చేసుకన్నారు. సివిల్స్ 2022 టాపర్‌గా ఇషితా కిషోర్ నిలిచారు. గరిమా లోహియా.. రెండో ర్యాంకు, ఉమా హారతి.. మూడో ర్యాంకు, స్మృతి మిశ్రా.. నాలుగో ర్యాంకు సాధించారు. ఇక, ఐఆర్‌టీఎస్ తిరిగి సివిల్ సర్వీసెస్‌లో చేర్చబడిన తర్వాత ఖాళీల సంఖ్య పెరిగింది. ఫలితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 మెరిట్ లిస్ట్‌లో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 

ఇదిలా ఉంటే.. యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది జూన్ 5న నిర్వహించబడింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. ప్రధాన పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించబడింది. ఫలితాలు డిసెంబర్ 6న ప్రకటించబడ్డాయి. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios