Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు పాలమూరులో పాలాభిషేకం

  • ఎపిలో రెండో డిఎస్సీ ప్రకటన ఇవ్వడం పట్ల హర్షం
  • తెలంగాణ సర్కారు నేర్చుకోవాలని సలహా
  • 42నెలల కాలంలో ఒక్క టీచర్ పోస్టు ఇవ్వలేదని ఆగ్రహం
Telangana youth organize milk bath to naidu for his recruitment spree

అప్పట్లో ఆయన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు. అందుకే గతంలో తనకు ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలు రెండు కండ్లతో సమానం అన్నారు. అయినా సీమాంధ్ర ముఖ్యమన్నట్లు వ్యవహరించారు. దీంతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైకి తెలంగాణకు వ్యతిరేకంగా పెద్దగా ఏమీ చేయకపోయినా..  లోపల మాత్రం తెలంగాణ రాకుండా చేయాల్సిన పనులన్నీ చేశారన్న పేరుంది. ఇదంతా గతం.

వర్తమానంలోకి వస్తే అప్పట్లో రెండు ప్రాంతాలకు టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు టిడిపి అధ్యక్షుడిగానే ఉన్నారు. కాకపోతే సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అయినా ఆయన సీమాంధ్రలో నిరుద్యోగులకు అనుకూలంగా తీసుకున్న ఒక నిర్ణయం తెలంగాణలో పాలాభిషేకం చేసేలా చేసింది. అదేమంటే.. ఎపిలో రెండో డిఎస్సీ ప్రకటన చేసింది సర్కారు. గత ఏడాది తొలి డిఎస్సీ వేసి 10వేల మందికి టీచర్ పోస్టులు ఇచ్చింది. తాజాగా రెండో డిఎస్సీ వేసి 12వేల పోస్టుల భర్తీకి నడుం బిగించింది.

అందుకే పాలమూరులో చంద్రబాబు చిత్రపటానికి తెలంగాణ నిరుద్యోగులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ వస్తే వేలకు వేలు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన నిరుద్యోగులు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. 42 నెలల కాలంలో పట్టుమని ఒక్క టీచర్ పోస్టు కూడా తెలంగాణ సర్కారు భర్తీ చేయలేకపోయింది. దానికి అనేక రకాల కారణాలు చూపించి వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై నిరుద్యోగులు కాక మీదున్నారు. అందుకే కొలువుల కొట్లాట సభకు విద్యార్థులు, నిరుద్యోగులు నిర్బంధాలను అధిగమించి కూడా బాగానే హాజరయ్యారు. కోదండరాం నేతృత్వంలో నిరసన తెలిపారు.

పాలమూరు జిల్లాను గతంలో చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అయితే పాలమూరును ఆయన దత్తత తీసుకున్నప్పటికీ పెద్దగా ఏమీ చేయలేదన్న విమర్శ కూడా ఉంది. అయినప్పటికీ పాలమూరులో నిరుద్యోగులు ఎపి ప్రభుత్వం నిరుద్యోగుల బాధలను పట్టించుకుంటున్నది అంటూ చంద్రబాబుకు పాలాభిషేకం చేయడం జిల్లాలోనే కాదు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దాంతోపాటు తెలంగాణ సర్కారు ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు పట్టించుకోవాలని వెనువెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ సైన్యం డిమాండ్ చేస్తోంది. ఎపి సర్కారును చూసి నేర్చుకోవాలని తెలంగాణ సర్కారును కోరుతున్నారు. 

 

సంగారెడ్డిలోనూ పాలాభిషేకం
పాలమూరులోనే కాకుండా తెలంగాణలోని సంగారెడ్డిలో కూడా యువత టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ లో గత 6 సం।లు గా డియస్సి కసరత్తు చేస్తున్నారు కాని స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవటం విచారణకరమని సంగారెడ్డి యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana youth organize milk bath to naidu for his recruitment spree

ఆంధ్రలో లోటు బడ్జెట్‌ తో ఉన్నాకుడా 2 వ సారి డియస్సి వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎపిలో రెండో డిఎస్సీ పూర్తయితే దాదాపు 22 వేల టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని చెప్పారు. అనిల్‌ రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండి మహబుబ్‌ అలి, జోగినాథ్‌ రవి కుమార్‌, ఎం.సంగమేష్‌, మహేష్‌, సల్మాన్‌, ఇస్మాయిల్‌, హరినాథ్‌, నవీన్‌, గోపి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios