లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది.
ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ.. కరోనా లాక్ డౌన్ రూపంలో మృత్యువు అతనిని కబళించింది. విదేశాల్లో ఓ తెలంగాణ యువకుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడుకు చెందిన శీలం రమణారెడ్డి, కృష్ణకుమారి కుమారుడైన హర్షవర్ధన్‌రెడ్డి ఖమ్మంలో డిగ్రీ పూర్తిచేసి గతేడాది దక్షిణాఫ్రికా వెళ్లాడు. అక్కడి మాలవీ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
అనారోగ్యానికి గురైన అతను స్వస్థలానికి రావడానికి 2నెలలుగా ప్రయత్నిస్తున్నాడు. లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది. దాంతో కుటుంబ సభ్యులు ఎంపీ నామాను కలిసి హర్షవర్ధన్‌ను త్వరగా తీసుకువచ్చేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు.
నామా సానుకూలంగా స్పందించి ప్రయత్నాలు మొదలుపెట్టే లోపే బుధవారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. తమ కుమారుడి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భౌతికకాయాన్ని స్వస్థలానికి రప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
