Asianet News TeluguAsianet News Telugu

కవితపై వ్యాఖ్యలు.. రేపు విచారణకు రాలేను, బండి సంజయ్ అభ్యర్ధనపై స్పందించిన మహిళా కమీషన్

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బండి సంజయ్‌కి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఈ నెల 15న విచారణకు రాలేనని, 18న వస్తానని సంజయ్ లేఖ రాశారు. 

telangana womens commission reacts on state bjp president bandi sanjay request
Author
First Published Mar 15, 2023, 9:08 PM IST

విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమీషన్ స్పందించింది. ఆయన అభ్యర్ధన మేరకు విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ మహిళా కమీషన్ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కమీషన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన మహిళా కమీషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయితే దీనికి స్పందించిన బండి సంజయ్ .. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం విచారణకు హాజరుకాలేనని, 18వ తేదీకి వాయిదా వేయాలని కోరుతూ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహిళా కమీషన్.. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు తమ ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించింది. 

ఇక, ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ  బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read: కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించను.. ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలి: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్

అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు.. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు.. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నారు. జీహెచ్‌ఎంపీ మేయర్ విజయలక్ష్మితో పాటు.. పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు శనివారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లగా.. వారికి అపాయింట్‌మెంట్ లభించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios