Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా ఉద్యమానికి నీరందించిన వాడు ... ఇక లేడు

తెలంగాణా ఉద్యమానికి నారు పోసిన వాడు కెసిఆర్ అయితే, నీరు పోసింది నీటిపారుదలరంగ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు. ఆయన  ఉదయం 11.23కు హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుప్రతిలో చనిపోయారు. ఒక ఏడాదిగా ఆయన  క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. ఒక వారం రోజుల కిందట ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.  కొద్ది సేపటి కందట తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రటించాయి. ఆయన పరిచయం ఆయన మాటల్లోనే...

telangana water expert vidyasagar rao no more
నేను, కెసిఆర్, నా తెలంగాణా

 

- ఆర్ విద్యాసాగర్ రావు (మాజీ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యుసి)

 

నేను నైజాం రాష్ట్రంలో పుట్టి, హైదారాబాద్ రాష్ట్రంలో చదువుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్జుమా అయ్యా. ఈ మూడు రాష్ర్టాలలో ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులతో నాకు మంచి సంబంధాలుండేవి. హైదరాబాద్‌లో నిజాం కాలేజీలో చదువుతున్న సమయంలో కన్నడ, మహారాష్ట్ర ఇట్లా అనేక ప్రాంతాల వారు ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మద్రాస్ వదిలిన ఆంధ్రులు చదువులు, కొలువుల పేరుతో నగరం చేరుకున్నరు. 


నేను ఉద్యోగ రీత్య ఢిల్లీ వెళ్లాను. ఎక్కువగా కేంద్రప్రభుత్వ నీటిపారుదల శాఖలో పనిచేసేవాణ్ని. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్న చొక్కారావు మాత్రం అప్పుడప్పుడు వచ్చి తెలంగాణ ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరుగుతోందని చెపుతుండేవారు. పోచంపాడు, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆర్జీలు ఇస్తుండేవారు. ఆయన తప్ప మిగిలిన ఎవరు కూడా తెలంగాణ గురించి చెప్పినట్లయితే నేను వినలేదు. ఎవ్వరు కూడా ఈ విషయంలో అప్పుడు పట్టించుకున్నట్లు నాకైతే తెలియదు.

 

జయశంకర్ గారు తెలంగాణకు నీళ్ళు నిధులు, నియామకాల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుసు. జాతీయ పత్రికల్లో చిన్నచిన్న కాలాల్లో వార్తలు వచ్చేవి తప్ప ఎవరు కూడా పట్టించుకోలేదు. నీళ్లల్లో నిధులల్లో అన్యాయం జరుగుతుందని ఆయన మీటింగ్‌లలో బలంగా చెప్తుండేవారు. 

 

2001లో కరీంనగర్‌లో కేసీఆర్ సభ పెట్టిన సమయంలో ఆయన గురించి విన్నాను తప్పా ప్రత్యక్షంగా ఎన్నడూ కలుసుకోలేదు. నేను రిటైర్ అయ్యాక 2000లో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీరింగ్ పోరంలో పనిచేస్తుండేవాడిని. సంఘం తరపున అప్పుడప్పుడు కూర్చుని తెలంగాణకు జరుగుతున్న ఆన్యాయాల గురించి చర్చించేవాళ్లం. మా దగ్గర జగదీష్ గారుండేవారు. ఆయన కేసీఆర్‌కు దగ్గరుండేవారు. ఆయన కేసీఆర్ గారి గురించి చెబుతూ, నీటి పారుదలపై కేసీఆర్‌కు ఇంట్రస్ట్ ఉంది. కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెబుతుండేవారు. అప్పటికే కేసీఆర్‌కి మంచి వాగ్దాటి ఉందని విని ఉన్నాను.

 

అదే సమయంలో దూరదర్శన్ వాళ్లు జాతీయ అంతర్జాతీయ నీటిపారుదల విషయంలో అనుభవం ఉంది కనుక మాకు ఒక లెక్చర్ ఇవ్వాలి. ఇంటర్వ్యూ తీసుకుంటాం. ప్రసారం చేస్తాం అన్నారు. నీళ్లు-సమస్యలు, దేశంలోని సమస్యలు అనే జనరల్ అంశం మీద ఇంటర్వ్యూ ఇచ్చా. ‘వార్త’లో వారం వారం ఈ కాలమ్‌లో నీళ్ల గురించి రాయండి అని చెప్పారు. అందులో అన్ని రకాల నీళ్ల సమస్యల గురించి రాయడం మొదలెట్టాను. అయితే నేను కేంద్రప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి ఆ స్థాయిలోనే రాస్తుండేవాన్ని. అ సమయంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని సార్. మీరు దాన్ని హైలైట్ చేస్తే లోకల్‌వారికి ఇంట్రస్ట్ కలుగుతుందని చెప్పారు. నిజానికి అంతర్జాతీయ నీటిపారుదల విషయంలో బాగా చదువుకున్న వారికి అవగాహనుంటుంది. కానీ మన ప్రాజెక్టుల గురించి మన లోకల్ పీపుల్‌కే తెలియదు . ఆ దిశగా రాయండి అనీ సూచించారు. వాస్తవానికి అప్పటికీ నాకు ఇక్కడి ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. అప్పుడు మిత్రుల సహకారంతో తెలంగాణ ప్రాజెక్టుల పుస్తకాలు తెప్పించుకుని చదివి రాయడం మొదలు పెట్టా. అవి చాలామందికి ఉపయోగపడ్డాయి. చాలామంది నన్ను మీటింగ్‌లకు ఆహ్వానించేవారు. కోదండరాం కూడా అప్పుడు విద్యావంతుల వేదిక తరపున పిలిచేవారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని సమావేశాలకూ వెళ్లేవాణ్ని . ఆ క్రమంలో తెలంగాణ ప్రాజెక్టుల మీదా అధ్యయనం చేస్తుంటే మన ప్రాజెక్టులకు ఇంత అన్యాయం జరిగిందా? అనిపించింది. 

 

(సిహెచ్ )విద్యాసాగర్‌రావు హోమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు హనుమంతరావు నాకు సీనియర్. ఆయన ఢిల్లీలో కూడా పరిచయం. ఆయన వాళ్ల తమ్ముడు మినిస్టర్ అయ్యాక మా వాడికి కొంత నీళ్ల గురించి చెప్తుండండి అని చెప్పేవారు. అలా నాకు విద్యాసాగర్‌రావుతో పరిచయం ఏర్పడింది. ప్రభుత్వం మనదే కనుక తెలంగాణ ప్రాజెక్టులు ఇప్పుడే చేసుకోగలం అని ఆయన చెపుతుండేవారు. మేచినేని కిషన్‌రావు వంటి వారితో పరిచయం ఉండేది.. ఒక రకంగా అప్పటికి నాకు బిజేపీతో పరిచయం ఉంది తప్ప టీఆర్‌ఎస్‌తో లేదు. అయితే బిజేపీ వాళ్ల అభిప్రాయం తెలంగాణ వస్తుందో రాదో గానీ ప్రభుత్వం ఉన్నపుడే కనీసం ప్రాజెక్టులు తెచ్చుకోవాలి అన్న విధంగా ఉండేది. అప్పటికే జలవిజ్ఞానంలో నా ఆర్టికల్స్ ధారాళంగా వస్తుండే. కాలమ్ చాలా పాపులర్ అయ్యింది. తెలంగాణ ప్రాజెక్టులపై చాలామందికి అవగాహన పెరిగింది. ఎక్కడ మీటింగ్ జరిగినా నా వ్యాసాలు చదివి వినిపించేవారు. ఇప్పటి వరకు మనం ఎలా మోసం పోయాం? మన ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదు? వంటి అంశాల మీదా ప్రతి వారం కొత్త కొత్తవిషయాలతో రాస్తుండేవాన్ని. అది చాలా చర్చనీయాంశమైంది.

2000 ఆగస్టులో నా మొదటి వ్యాసం అచ్చయింది. 2001లో టీఆర్‌ఎస్ పుట్టింది. 2001 అక్టోబరో లేదా నవంబరో గుర్తులేదు. కేసీఆర్ ఖమ్మం వెళ్లారు. అప్పటికీ నాకు కేసీఆర్ గారితో ముఖపరిచయం లేదు. రాత్రి తొమ్మిది గంటలకు ఒక కాల్ వచ్చింది. ఏవండీ...మీతో కేసీఆర్‌గారు మాట్లాడుతారంట అన్నారు. అదేంటీ? నాతో కేసీఆర్ మాట్లాడడమేంటీ? అప్పటి వరకు నాకు పరిచయమే లేదు కదా! అనుకున్నా. సరే మాట్లాడుతా...ఇవ్వండి అన్నా. ఇచ్చారు. మీ వ్యాసాలు చదివాను. చాలా విషయాలు రాస్తున్నారు. నాకు నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ గురించి వివరాలు కావాలి. రేపు ప్రెస్‌మీట్ ఉంది అన్నారు. నాకు కొంచెం స్పష్టంగా వివరాలు కావాలి అన్నారు. నాకు ఒక ఐదు నిమిషాలు టైమివ్వండి అన్నాను. ఆయన సరే అన్నారు. ఆ తరువాత వివరాలు ఇచ్చా. ఆ తరువాత మరెప్పుడు ఆయనతో కలవలేదు.

 

14 ఏప్రిల్ 2002 అంబేద్కర్ జయంతి రోజున హబ్సిగూడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి కేసీఆర్ వచ్చారు. వాస్తవానికి ఆ రోజు నాకు వేరే అపాయింట్‌మెంట్ ఉంది. నేను వెళ్లా. అప్పుడు వారి ఆఫీసు నుంచి పోన్ వచ్చింది. సార్ మీ ఇంటికి వస్తున్నారు అన్నారు. నేను హడలిపోయా..ఈ పెద్దమనిషి రావడం ఏంటీ? కలవడం ఏంటీ? అని, సార్‌ను నేనే వచ్చి కలుస్తా అని చెప్పా. వాస్తవానికి ఆయన వస్తే కూర్చోవానికి కుర్చీలులేవు, వసతులు లేవు. చాయ్ ఇవ్వడానికి మనుషులు లేరు అన్న ఆలోచనలో నేనున్న. మరోవైపు అదే సమయంలో సికింద్రాబాద్‌లో తప్పకుండా వెళ్లాల్సిన పని ఉండే. కానీ ఆయన రానే వచ్చారు. నేనేమో సికింద్రాబాద్‌లో ఉన్న. మీరు పని చూసుకుని రండి అన్నారు. నేను మా మిసెస్‌కు పోన్ చేసి, ఫలానా ఆయన వస్తారట చాయ్, నీళ్లు ఇవ్వమని చెప్పా. 

 

నేను నా పని పూర్తయిందో లేదో మా మిసెస్ పోన్ చేశారు. సార్ వచ్చారు. టీ ఇచ్చా. కూర్చున్నారు అని. హడవిడిగా ఆటో పట్టుకుని వచ్చా. వచ్చేటప్పటికీ వీధి వీధంతా కార్లే. ఇంట్లోకి వచ్చేసరికి చాలామంది ఉన్నారు. రావడంతోనే పలకరించారు. మీరు మాకు హెల్ప్ చేయాలి. మాకు నీటిపారుదల రంగ ఇన్‌పుట్స్ లేవు. ప్రజలకు చెప్పడానికి ఇన్‌పుట్స్ కావాలి. తెలంగాణ కావాలి అంటే ఎందుకు, ఏమిటి అంటారు కదా! అందుకే మీరు సాయం చేయాలి అన్నారు. మీ గురించి జయశంకర్ సార్ చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరూ చెప్పగలరు కానీ సాధికారికంగా చెప్పగలిగే వ్యక్తులు లేరు. జయశంకర్‌సార్ తంటాలు పడుతున్నారు. మీరు వస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. 

 

అప్పటికే ఆలే నరేంద్రగారు టీఎస్‌ఎస్ పెట్టారు కనుక బిజేపీలో ఉన్న పరిచయంతో అప్పుడప్పుడు వారి సమావేశాల్లో మాట్లాడిస్తుండేవారు. అదే విషయం నేను చెప్పాను. అయితే, మీరిద్దరూ తెలంగాణ కోసమే పనిచేస్తున్నారు కనుక ఇద్దరు కలిసి పనిచేయచ్చు కదా అని అడిగా. ఆయన కూడా ఆలోచిస్తా అంటూనే మీకేమైనా అభ్యంతరాలున్నాయా? అని అడిగారు. నేనన్నాను. నేనేమీ వారికి కట్టుబడి ఏం లేను. కానీ తెలంగాణ కోసం పనిచేస్తున్న ఇద్దరూ ఒక్కటైతే బాగుంటుంది అన్నాను. దాని గురించి ఆలోచిద్దాం అన్నారు. పార్టీలో చేరడం వేరు అభిమానం వేరు అనీ అన్నాను నేను. దానికి మీరు ఉంటానంటే ఫ్రీగా ఉండచ్చు అన్నారు కేసీఆర్.

 

ఇలా ఉండగా ఒకనాడు ప్రిసిడీయం కమిటీకి వైస్‌చైర్మన్‌గా విద్యాసాగర్‌రావు అని మీడియాలో వచ్చింది. కమిటీలో వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యావంతులు, అడ్వకేట్లు ఉండేవారు. అప్పటికీ నరేంద్ర, కేసీఆర్ కలిసారు. అప్పుడు ఆ సభలో జయశంకర్‌గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఇక మీదట నుంచి నీళ్ల గురించి నేను మాట్లాడను. మీరే మాట్లాడాలి అని జయశంకర్ గారన్నారు. అప్పుడు తొలిసారి మాట్లాడాను. పదవి తీసుకున్నం కనుక తప్పలేదు. 

 

అప్పటి నుంచి అఖిలపక్ష మీటింగ్ ఏది జరిగినా, ముఖ్యంగా నీళ్ల గురించి ఏ సమావేశం జరిగినా నన్ను పంపేవారు. అఫీషియల్‌గా నీళ్ల గురించి ఏ విషయం వచ్చినా నా దగ్గర సలహా తీసుకునేవారు. ఆ తర్వాత ఆయనతో ఎంత క్లోజ్ అయ్యాం అంటే జయశంకర్ గారు ఒకటి , నేను ఒకటి -కేసీఆర్‌కు మా ఇద్దరి మీదా ఎంత విపరీతమైన నమ్మకం అంటే వీళ్లు నన్ను ఎప్పటికీ మోసం చేయరు అని! మనం ఇచ్చిన సలహాలు అన్నీ ఆయన స్వీకరిస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. జయశంకర్ సారే ఒక్కోసారి అలా చెబితే ఆయన నొచ్చుకుంటాడో ఏమో.... బాధపడుతాడో ఏమో అనేవారు. ఇష్టం ఉండని లేకపోని, వినని వినకపోని నేను మాత్రం నేను చేప్పాల్సింది చెప్పేవాణ్ని. ఉద్యమ సమయంలో జయశంకర్‌సార్‌ని, నన్నూ తప్పకుండా మాట్లాడించేవారు. నీళ్ల గురించి తప్పకుండా చెప్పమనేవారు.


ఈ సందర్భంగా నన్ను చాలామంది మిత్రులు సార్ మీరు చేస్తున్న పని ఏంటీ? మీకు దేవుడు అంతో ఇంతో నాలేడ్జీ ఇచ్చారు. దాన్ని మీరు ఎవరిచేతిలో పెడుతున్నారు. ఒక రాజకీయ నాయకుని చేతిలో పెడుతున్నారు. అతను మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. మీరిచ్చే సమాచారాన్ని వాడుకుంటూ కేసీఆర్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. దానివల్ల మీకేం లాభం? అనేవారు.

 

నేను అనేవాణ్ని నా వల్ల సార్‌కు లాభం. సార్ వల్ల నాకు లాభం. నేను చెప్పేవాణ్ని. అంతే. బంగారు పళ్లానికైనా గోడ అవసరం. పళ్ళెం తనకు తాను నిలబడలేదు కదా! ఇవాళ నా దగ్గర ఇన్‌ఫర్మేషన్ ఉంది. జయశంకర్‌సార్ ఒంటరిగా ఎంతో కాలంగా ప్రయత్నించారు. ఆయన మాట్లాడితే ఎక్కడొచ్చేది పత్రికలో... ఎక్కడో మూలకు వచ్చేది. నేను మాట్లాడితే కూడా అంతే వస్తుంది. యాభై మందో వందమందో వస్తారు. కానీ, కేసీఆర్ నోట నేను చెప్పాల్సిన మాటలు వస్తే ఆయన ఆ మాటల్నే ప్రజలకు అర్థమయ్యే రీతిలో బ్రహ్మాండంగా చెబితే- విషయం జనాలకు చేరుతుంది. ఆయనలో ఆ నేర్పు ఉన్నది. ఎంత సంక్లిష్టమైన విషయమైన ప్రజలకు అర్థమయ్యే భాషలో ఎట్ల చెప్పాల్నో కూడా ఆయనకు తెలుసు అని చెప్పేవాడ్ని. ఆయనలా మనం చెప్పలేం అది నాకు స్వీయానుభవం కూడా. ఒక ఉదాహరణ చెప్తా....

 

ఒకసారి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఒదలడం లేదు. కృష్ణడెల్టాకు నీళ్లు వదిలారు. మనం అడిగితే లేవంటున్నారు. నాగార్జున సాగర్ మీదా మీటింగ్ పెట్టాం. ఆ సమయంలో నేను చెప్పేది చెప్పిన. ఆ తర్వాత కేసీఆర్ లేచి ఇగో... గీ సార్ ఏం మాట్లాడిండో అర్థమైందా? అని అడిగిండు. అయ్యింది సార్ అన్నరు. కానీ ఇట్ల చెబితే వాడు వింటాడే. లుంగి పైకి కట్టాలే. గుత్పపట్టాలే అనంగానే ఓ.....అని జనం స్పందన. అంటే ఆయన చెప్పిన మాట వారి మీదా చాలా ప్రభావం చూపింది. అంటే ప్రజలకు వారి భాషలోనే చెప్పడం ఆయనలో ఉన్న ప్రత్యేకత. ప్రజలకు పర్పస్ తెలుసు. నేను ఎన్ని టీఎంసీలో చెప్తే అర్థం కాదు. ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతది. ఆ ప్రభావం ఏమో కానీ మేము తిరిగి వచ్చేలోపు నీళ్లు వదిలారు. అది మా ఫస్ట్ సక్సెస్.

కేసీఆర్ గారికి అన్ని విషయాలకంటే నీళ్ల విషయం చాలా ఇష్టం. ఆయన అనేక సందర్భాల్లో కూడా ప్రజలకు నీళ్లు అనేవి చాలా అవసరం. దేవుడు అదృష్టవశాత్తు మనకు సరిపడినన్ని నీళ్లు ఇచ్చాడు. ఏ రాష్ర్టానికి లేనటువంటి నీళ్లు మనకు ఉన్నాయి. కానీ ఇన్ని ఉండి దరిద్రం ఏంది? మనం వాటిని తగు రీతిన ఉపయోగించుకోలేకపోయాం అని బాధపడేవారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం సమైక్య పాలకులు. ప్రాజెక్టు కడుతున్నామని నమ్మించి అరచేతిలో స్వర్గం చూపెట్టారు. సార్ ఇప్పటి ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రాజెక్టులను పునఃసమీక్షంచాలే అని. అంగుళం అంగుళం మనకు నీళ్లల్లో జరిగిన అన్యాయం గురించే ఆలోచన. 

వాళ్లకు అంటే సీమాంధ్రులకు రెండే రెండు వదులుకోవడం ఇష్టం లేదు. అది హైదరాబాద్, కృష్ణ డెల్టా. అందుకే నానా యాగీ చేశారు. హైదరాబాద్ వారికి సాలిడ్ బంగారం, కృష్ణ లిక్విడ్ బంగారం అందుకే వారు వదులుకోవడానికి అర్గ్యుమెంట్స్ చేశారు. కేసీఆర్ గారిని కూడా రాజకీయంగా ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. 

జయశంకర్, నేను అనేక రాత్రుళ్లు ఆయనతోనే ఉండేవాళ్లం. ఢిల్లీలో ఉన్నపుడు కూడా ఎన్ని రాత్రులో చెప్పలేం. గంటల కొద్ది చర్చించేవారు. నన్ను కేసీఆర్ విద్యన్న అనేవాడు. జయశంకర్ సార్‌ను సార్ అనేవాడు. గంటల కొద్ది ఏం చేయాలి? వాళ్లు ఒప్పుకుంటలేరు. వీళ్లు ఇట్ల అంటున్నరు అని అన్ని చెప్పేవాడు. ఒక్కోసారి అనిపించేది, ఈ మనిషికి ఇంత డెడికేషన్ ఎట్ల వచ్చిందీ అని. రాను రాను ఎలా అయ్యాడంటే, ఇక తనలో ఒకటే వచ్చింది. నేను తెలంగాణ తెచ్చుడో చచ్చుడో అని!


నేను ఆయనను ఎందుకు లైక్ చేస్తున్న...నాకు తెలిసినంత వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ సాధన క్రమం కోసం పోతున్నడా? పక్కకు తిప్పుతున్నాడా బండిని? అని చూస్తాను. ఎంతోమంది దిగిపోయిండ్లు బండి నుంచి. ఎందుకు దీన్ని మూసి వేయమన్నరు? ఆయన ఎంబడి ఉన్నవాళ్లల్లో చాలామంది వెళ్లిపోయారు. కానీ, ఆయన ముందుకే నడిచిండు. కేసీఆర్‌కు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే అద్బుతమైన జ్ఞాపకశక్తి! ఇవ్వాల్టికి కూడా వేల మంది కార్యకర్తలను పేరుతో సహా గుర్తు పట్టగలడు. మాకైతే ఆశ్చర్యం అనిపిస్తది. మేథోశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లాంటిదంటే ఏ సబ్జెక్ట్ అయిన సరే- అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్‌కానీ, ఎకనామిక్సే కానివ్వండి. వింటడు, తెలుసుకుంటడు. తెలుసుకుని ఒక్కొక్కసారి దాన్ని కరక్ట్ కూడా చేయడు. దాన్ని ప్రజలకు మోతాదుకు మించి చెబుతడు. ఆయనకు తెలుసుగానీ ప్రజలకు అర్థమవ్వాలి కదా. రాజకీయంగా అది అవసరం కూడా. 

 

ఇంకో విషయం. ఆయన మాట్లాడితే బాగుంటది. కేసీఆర్ ఇంకా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంటుంది. నా జీవితంలో అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారిని నలుగురిని చూశా. వారు నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వాజ్‌పాయ్, నాలుగవ వ్యక్తి కేసీఆర్. ఆయనతో ఎన్నో వేల సభల్లో పాల్గొన్న. మాట్లాడిన. శ్రోతగా విన్న. కేసీఆర్‌కు ఎంతో జ్ఞాపకశక్తి ఉంటది. సబ్జెక్ట్‌ను ఎంత చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదు.

 

శ్రీకృష్ణ కమిటీ ముందు మనం హాజరుకావద్దు అని కేసీఆర్ నిర్ణయించిన సమయంలో నేను నివేదిక ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పి ఒప్పించాను. అద్వీతీయమైన రిపోర్ట్ తయారు చేశాం. అదే కాపీని అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. నాకు పార్టీలో చాల ఫ్రీడం ఇచ్చారు. ఏం కావాలన్న తెచ్చుకో. ఏ పుస్తకం అంటే అది తెచ్చుకో అని పూర్తి ఫ్రీడం ఇచ్చిండు. ఒక్కనాడంటే ఒక్కనాడు గూడ నన్ను పరుషపదం అనలేదు. ఎంతోమంది హర్ట్ అయ్యాం అంటారు. నా విషయంలో మాత్రం అలాంటిది ఎన్నడూ జరగలేదు. సార్ సార్ అని జయశంకర్ గారిని, విద్యన్న విద్యన్న అని నన్ను పిలుస్తారు. నాతో ప్రేమతో ఉంటారు. 

 

తెలంగాణ భవిష్యత్తును గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో కేసీఆర్ ముందుంటారు. నా డ్యూటీ ఏందంటే -నీళ్ల గురించి కొట్లాడి , నీళ్లను పరిరక్షించుకోవాలే. ఉన్న నీళ్లు పోవద్దు. మన నీళ్లు పోవద్దు, అవసరమైతే ఇంకా ఎక్కువ నీళ్లు రావాలి. ఈ బాధ్యత నాకు అప్పగించిండు. హరీష్‌రావుగారితో కలసి పనిచేస్తున్నా.

 

(‘నమస్తే తెలంగాణా’ లో విద్యాసాగరరావు రాసిన వ్యాసంలోని కొన్ని భాగాలు)

Follow Us:
Download App:
  • android
  • ios