కుంటాల జలపాతం చావులు రిపీట్ కానివ్వం

కుంటాల జలపాతం చావులు రిపీట్ కానివ్వం

కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం అని, అయితే అక్కడకు విహారం కోసం వచ్చే యువతీ, యువకులు ప్రమాదాల బారిన పడి చనిపోవటం చాలా బాధాకరం అన్నారు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న. కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల కోసం కనీస వసతి సౌకర్యాలు, వచ్చే సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

కుంటాల సహజ సౌందర్యం, అటవీ ప్రాంతం ఏ మాత్రం దెబ్బకుండా,  పర్యావరణ హితమైన టూరిజంలో భాగంగా కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర అభివృద్ది పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.  జలపాతం ఎగువన ఉన్న గుండంలో పడి చాలా మంది చనిపోతున్నారని, అక్కడి ప్రమాదకర పరిస్థితుల వల్ల జలపాతంలో పడి ఇప్పటిదాకా 136 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నా యన్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉండాలన్నారు. 

తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి  కుంటాల అభివృద్ది ఉమ్మడి రాష్ట్రంలోనే జరగాల్సిందని, అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. అదిలాబాద్ ను రెండవ కాశ్మీర్ గా పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీయార్ జిల్లాలో పర్యాటక అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జలపాతం సందర్శనకు వచ్చేవారికి టాయిలెట్లు, బాత్ రూమ్ ల్లాంటి  కనీస సౌకర్యాలకు తోడు, ప్రమాదాల బారిన పడకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో స్థానికులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చించి పరిష్కరిస్తామని మంత్రి రామన్న స్పష్టం చేశారు.

త్వరలోనే అధికారుల బృందం మరో సారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేస్తారని, వేసవిలోనే పనులు పూర్తి అయ్యేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page