లేబర్ కోడ్స్ అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోదని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. యాజమాన్యాలు, కార్మికులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమంతో పాటు పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు సజావుగా, లాభదాయకంగా నడిచినప్పుడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా కార్మికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD) లో మంగళవారం లేబర్ కోడ్స్ (కార్మిక చట్టాలు) పై నిర్వహించిన భాగస్వాముల సంప్రదింపుల సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, నిబంధనల రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.

సమతుల్య విధానంతోనే పారిశ్రామిక ప్రగతి

లేబర్ కోడ్స్ అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోదని మంత్రి హామీ ఇచ్చారు. పారిశ్రామిక వర్గాలు, కార్మిక సంఘాలు ఎలాంటి సంకోచం లేకుండా తమ అమూల్యమైన సూచనలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. ఇరువర్గాలకు మేలు చేసే సమతుల్య విధానమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

"యాజమాన్యాలు, కార్మికులు పరస్పరం చర్చించుకుని సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటే పరిశ్రమల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పరిశ్రమలు బాగుంటేనే కార్మికులు సంతోషంగా ఉంటారు. లేబర్ కోడ్స్‌ను హదావుడిగా అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అవసరమైతే నిర్దిష్ట అంశాలపై లిఖితపూర్వక సూచనలు ఇస్తే, వాటిపై మరోసారి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం" అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.

నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం : పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు పారిశ్రామిక సంఘాలతో నిరంతరం చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) : రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏటీసీల ద్వారా యువతకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి, పరిశ్రమలకు కావాల్సిన నిపుణులను అందుబాటులోకి తెస్తామని అన్నారు.

కనీస వేతనాల అంశంలోనూ ఇదే నిబద్ధత

గత పదేళ్లుగా కనీస వేతనాల పెంపు లేకపోవడంతో కార్మికుల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయని మంత్రి వెంకటస్వామి గుర్తుచేశారు. ఈ విషయంలోనూ ప్రభుత్వం ఇరువర్గాలకు న్యాయం జరిగేలా సమతుల్య విధానాన్నే అనుసరించిందన్నారు. పారిశ్రామిక సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వాతే కనీస వేతనాలపై ప్రతిపాదనలు రూపొందించామని, ఇందుకు సహకరించిన పారిశ్రామిక సంఘాలకు మంత్రి వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు.