సిగాచి పేలుడు బాధితుల పరిహారం వ్యవహారం పొలిటికల్ వార్ కు తెరతీసింది. ప్రతిపక్ష బిఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య దీనిపై మాటల యుద్దం సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి వివేక్ సీరియస్ అయ్యారు. 

Hyderabad : సరిగ్గా ఏడాదికిందట ఇదేరోజు (జూన్ 30న) హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో జరిగిన దుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఏకంగా 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ దుర్ఘటన జాతీయ స్థాయిలో కలకలం రేపింది.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనాస్థలిని సందర్శించారు. ఈ సమయంలోనే పరిశ్రమ యాజమాన్యం కూడా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే ఈ దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా బాధితులకు పూర్తిస్థాయి పరిహారం అందలేదు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రతిపక్ష బిఆర్ఎస్ సపోర్ట్ గా నిలుస్తోంది... వారికి న్యాయం చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సిగాచి బాధితుల సాయంపై స్పందిస్తూ హరీష్ రావు తీరును తప్పుబట్టారు. హరీష్ రావు కేవలం రాజకీయాల కోసమే అసత్య ప్రచారం చేస్తున్నారని... ఈ పద్దతి మానుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసే వరకు సిగాచి కంపెనీని ప్రభుత్వం వదిలిపెట్టదని మంత్రి స్పష్టం చేశారు.

'సిగాచి బాధితులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : వివేక్

సిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని... బాధితుల పక్షాన నిలిచిందని వెంకటస్వామి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని... బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబులతో కలిసి తానుకూడా ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం జరిగేలా చూశానని వెంకటస్వామి తెలిపారు. తర్వాత కూడా సిగాచి కంపెనీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించేలా చేశామన్నారు. అందువల్లే బాధిత కుటుంబాలకు ఇప్పటికే దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిందని మంత్రి స్పష్టం చేశారు.

బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడటమే కాదు మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా యాజమాన్యంపై చాలా కఠినంగా వ్యవహరించామని మంత్రి వెంకటస్వామి తెలిపారు. ఇందులో భాగంగానే చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కంపెనీ సీఎండీని కూడా అరెస్ట్ చేశామని మంత్రి గుర్తు చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హైకోర్టులో కూడా ప్రభుత్వం చెప్పిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు సిగాచి కంపెనీపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందే తప్ప తగ్గదని మంత్రి వెంకటస్వామి స్పష్టం చేశారు.

హరీష్ రావుది రాజకీయమే : వివేక్

ఇప్పుడు సిగాచి ఘటనతో రాజకీయాలు చేయాలని చూస్తున్న హరీష్ రావు గతంలో వారి ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలుసుకోవాలని మంత్రి సూచించారు. కొండగట్టు ఆర్టిసి బస్సు ప్రమాదంలో 60 మంది భక్తులు మరణిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూసేందుకు రాలేదని అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వలేకపోయారని అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తారుమారు జరిగి 20 మంది విద్యార్థులు చనిపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారన్నారు. గత బిఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలో అనేకం జరిగాయని... ఎక్కడా బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. కానీ ఇప్పుడు సిగాచి ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు అన్నివిధాలుగా ఆదుకుంటున్నా హరీష్ రావు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని... ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని మంత్రి వెంకటస్వామి మండిపడ్డారు.