Asianet News TeluguAsianet News Telugu

రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన టీచర్లు.. అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన..

తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నెంబ‌ర్ 317 (317 GO) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్స్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. 

Telangana teachers protest at rangareddy collectorate over 317 go
Author
Hyderabad, First Published Jan 22, 2022, 12:32 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నెంబ‌ర్ 317 (317 GO) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్స్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. 317 జీవోతో తాము స్థానికతను కోల్పోతున్నామంటూ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ పేరుతో మా ప్లేస్‌లోని నాన్ లోకల్స్ వచ్చారని అన్నారు. జూనియర్లు అయినందుకు తమను వేరే జిల్లాలకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే స్థానికత కోసమని.. కానీ ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. అయితే కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.


ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు వివిధ పద్దతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి కూడా యత్నించారు. ప్రభుత్వం మెడలు వంచైనా జీవో 317 సవరణ సాధిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అప్పటివరకు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. 

జీవో 317ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయుల కేటాయింపులో శాస్త్రీయత లేదన్నారు. సీనియారిటీ లిస్టును ఎక్కడా ప్రదర్శించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.  తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios