తెలంగాణలో రోజురోజుకూ కుంచించుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కించి పట్టాల మీదకు తెచ్చేందుకు తెలంగాణ తెలుగు తమ్మళ్లు నడుం బిగించారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన గడ్డమీద బతుకు పోరాటం చేస్తున్న పార్టీని బతికించేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీకి ఇవాళ కాకపోయినా.. రేపైనా పూర్వ వైభవం తేవాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని తమ్ముళ్లు కోరుతున్నారు. అవసరమైతే పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే కసరత్తు షురూ చేశారు.

నాయకులంతా వలసబాట పట్టడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ దిగజారిపోతున్నది. పార్టీకి ఇప్పటికీ అనేక జిల్లాలో బలమైన కేడర్ ఉన్నది. బిసిల ఓటు బ్యాంకుతోపాటు కమ్మ సామాజికవర్గం ఇంకా టిడిపితోనే ఉన్నది. దానికితోడు మాదిగ సామాజికవర్గం కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని టిఆర్ఎస్ లో కలపాలంటూ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మోత్కుపల్లి కూడా వలస బాట పట్టొచ్చని తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనని తమ్ముళ్లు కోరుకుంటున్నారు.

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకోవడం కుదరని పక్షంలో బ్రాహ్మణిని బరిలోకి దింపాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ బతకాలంటే ఎన్టీఆర్ రక్త సంబంధమే పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ తమ్ముళ్ల వైపు నుంచి వినబడుతోంది. అయితే బ్రాహ్మణి విషయంలో ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేచాన్సే లేదని గతంలోనే బాబు స్పష్టం చేసిన విషయాన్ని కొందరు సీనియర్లు ఉదహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్న జూనియర్ ఎన్టీఆర్ కానీ.. చెల్లి బ్రాహ్మణి కానీ ఎవరో ఒకరు సారధ్య బాధ్యతలు తీసుకుంటేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది తప్ప.. మరో విధంగా సాధ్యం కాదన్న భావన తమ్ముళ్ల నుంచి వ్యక్తమవుతోంది.

మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?

అయితే తమ్ముళ్లు ఎంత బలంగా కోరుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు ఇప్పట్లోనే తీసుకునే చాన్స్ ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీతో జూనియర్ ఫ్యామిలీకి మధ్య విభేదాలున్నాయి. దానికితోడు ప్రస్తుతం పాలిటిక్స్ లోకి ఇప్పుడప్పుడే జూనియర్ వస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మరికొంత కాలం సినిమాలకే పరిమితం కావొచ్చన్న ప్రచారం ఉంది. అంతేకాదు.. ఒకవేళ ఎన్టీఆర్ అంటూ రంగంలోకి దిగితే.. తెలంగాణలో పార్టీ బాధ్యతల్లోకి వస్తారా? లేక ఆంధ్రలో పార్టీ బాధ్యతలు కోరుకుంటారా అన్నది కూడా హాట్ టాపిక్ గానే ఉన్నది. 2019 ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి... జూనియర్ ఎన్టీఆర్ వస్తే గిస్తే.. 2024లోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించి కనీసం 2019 ఎన్నికల ప్రచారానికి దింపాలన్న వాదన కూడా కొందరు కార్యకర్తలు చేస్తున్నారు. మరి ఇప్పటికే తెలంగాణలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జూనియర్ సేవలు తెలంగాణ టిడిపికి అవసరమవుతాయా? అన్నది కూడా చర్చల్లో నానుతున్నది. పొత్తులు పెట్టుకుంటే టిడిపికి ఎన్ని సీట్లు ఇస్తారు? ఒకవేళ వారికిచ్చే సీట్లలోనే జూనియర్ ప్రచారం చేస్తారా? లేదంటే టిడిపి, టిఆర్ఎస్ మొత్తానికి ప్రచారం చేస్తారా అన్నది కూడా చర్చలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ బ్లడ్ రావాల్సిందే : శ్రీనివాస్

తెలంగాణలో టిడిపిని ఖతం చేసేందుకు పెద్ద నాయకులంతా ప్రయత్నాలు చేస్తుంటే పార్టీని బతికించేందుకు తమలాంటి చిన్న కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన మాతంగి శ్రీనివాస్ అనే నాయకుడు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితేనే తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తేగలమని ఆయన ఏషియానెట్ తో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. ఆయన కానీ.. బ్రాహ్మణి కానీ.. ఇద్దరిలో ఎవరైనా రావాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బ్లడ్ వస్తేనే పార్టీకి మనుగడ అన్నారు. ఇదే విషయాన్ని అధినేతకు సూచిస్తామన్నారు.