హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే డైలమాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పడినట్లు కనిపిస్తోంది. పొత్తుకు కాంగ్రెసు, వామపక్షాలు నిరాకరించాయి. దీంతో టీడీపీ తెలంగాణలో ఏకాకి అయింది. కాంగ్రెసు, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావించింది. 

అయితే, టీడీపీతో పొత్తుకు ఆ పార్టీలు సుముఖంగా లేవు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితిలో టీడీపీ పడింది. తెలంగాణ దాదాపుగా నిర్వీర్యమైన స్థితిలో పోటీ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అనేది సందేహమే.

మున్సిపల్ పోల్స్: ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం సమావేశమై, తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2018 శాసనసభ  ఎన్నికల్లో టీడీపీతో కలిసి కాంగ్రెసు పోటీ చేసింది. అయితే, కాంగ్రెసుకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ ఓట్లు తమకు పడుతాయనే ఉద్దేశంతో కాంగ్రెసు పొత్తు పెట్టుకుంది. అయితే, ఈ పొత్తును ప్రజలు తిరస్కరించారు. 

లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెసు మూడు స్థానాలను గెలుచుకుంది. లోకసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకీ దూరంగా ఉంది. ఇటీవలి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బలం ఉన్న చోట పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. బలాబలాలను అంచనా వేసి ఓ నిర్ణయానికి రావడానికి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ రాష్ట్రస్థాయి ఎన్నికల కమిటీని వేశారు. 

కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

టీడీపీ ఇటీవల పార్లమెంటు ఇంచార్జీలను నియమించింది. కానీ శాసనసభ నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇది కూడా టీడీపీ చిక్కులు తెచ్చపెట్టవచ్చు. తెలంగాణలో క్యాడర్ తుడిచిపెట్టుకుపోయిన స్థితిలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం అంత సులభం కాకపోవచ్చు.