ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఓ తెలంగాణ విద్యార్థి అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో హైదరాబాద్ లో నివాసముంటున్న అతడి కుటుంబంలో  విషాద చాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే  కుత్భుల్లాపూర్‌ సర్కిల్‌ సూరారం ప్రాంతంలో నివాసముంటున్న జాకబ్‌ కు కుమారుడు నాగ తులసీరామ్,కుమార్తె స్పూర్తి ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం తులసీరామ్ బీటెక్ కంప్లీట్ కావడంతో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళాడు.  యుఎస్‌లోని బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో చదువుకుంటూ వాటర్‌బరీలో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి కనెక్టికట్ రాష్ట్రంలోని వాటర్‌బర్లీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని తులసీరాం స్నేహితుడు శివ తండ్రి జాకబ్ కు సమాచారం అందించారు.  దీంతో వారి కుటుంబసభ్యులు, బందువులు కన్నీరుయున్నీరుగా విలపిస్తున్నారు.

తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తరలించడంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జాకబ్‌ స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌ను కోరారు. దీంతో అతడు ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అమెరికాలోని ఇండియన ఎంబసీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.