ఖమ్మంలో 13 ఏళ్ల బాలిక పై లైంగిక దాడికి యత్నించి... ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.

దీనిపై పలు పత్రికలలో , టీవీ ఛానల్స్‌లో వచ్చిన కథనాల ఆధారంగా ఎస్‌హెచ్ఆర్సీ సుమోటోగా కేసును స్వీకరించి , విచారణకు ఆదేశించింది. 70 శాతం గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక కేసులో ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని పోలీసుల వివరణ కోరింది.

వచ్చే నెల 6వ తేదీలోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఖమ్మం నగర పోలీస్ కమిషనర్‌కు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 


కాగా ఖమ్మంలో 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాలిక నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 70 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతోంది.

10 రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం ఎవరికైనా చెబితే బాధిత బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.