హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలకు  ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.  రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పాలకవర్గం కాలపరిమితి ముగిసింది. దీంతో  కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఆయా మున్సిపాలిటీలకు , కార్పోరేషన్లకు రిజర్వేషన్లను ఈ నెల 14వ తేదీన ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. పాలకవర్గాలు లేని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా చర్యలు తీసుకొంటుంది.ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలోనే వార్డుల పునర్విభజన వంటి కార్యక్రమాల గురించి ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

ఈ రెండు కార్పోరేషన్లతో పాటు అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీగా ఉన్న ఒక్క వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీలోపుగా ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.పోలింగ్ స్టేషన్తో పాటు ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 15న ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.