ఇంటి పార్టీ వస్తే ఇక దుబాయి, బొగ్గుబాయి తిప్పలే ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్ ఈ ఘటనపై స్పందించాల్సిన అసవరం ఉంది.
బతుకు బాగుండాలని ఏడారి దేశానికి పోతే ఓ తెలంగాణ బిడ్డకు బతుకే లేకుండాపోయింది. అతడి కుటుంబం కడసారి చూపునకు కూడా నోచుకోని పరిస్థితి వచ్చింది.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ కు చెందిన మన్నెల రాములు ఉపాధి కోసం సౌదీ బాట పట్టాడు. పిల్లలిద్దరని బాగా చదివించాలని, చేసిన అప్పులు తీర్చాలని ఏడారి దేశంలో గొర్రెల కాపరిగా పనికి కుదిరాడు.
అయితే గత ఏడాది ఫిబ్రవరి1 న సౌదీ ఏడారిలో కుళ్లిపోయిన ఓ మృతదేహం లభ్యమైంది. ఓ ఆఫ్రికన్ కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు కుళ్లిపోయిన ఆ మృతదేహాన్ని పరిశీలించి అది మన్నెల రాములుదిగా గుర్తించారు. స్థానిక ఆస్పత్రిలోని ఓ మార్చురీలో శవాన్ని భద్రపరిచారు.
రెండేళ్ల కిందటే రాములు చనిపోయినట్లు డాక్టర్లు దృవీకరించారు. సౌదీ ఏడారిలో ఉష్ణోగ్రత దాదాపు 50 సెంటీగ్రేడ్ ల వరకు ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం చేయడం తో డీహైడ్రేషన్ కు గురై నీళ్లు దొరక్క రాములు మృతిచెంది ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు.
భారత్ దౌత్య అధికారులకు ఈ విషయం తెలియడంతో తెలంగాణలో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులకు వార్తను చేరవేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి భారత్ విదేశాంగ శాఖను సంప్రదించాలని సూచించారు.
అయితే భర్త పంపించే డబ్బుతోనే జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ఏం చేయలేని స్థితిలో పడిపోయింది. రాములు కడసారి చూపు కోసం ఆ కుటుంబం భారత్ విదేశాంగ శాఖ, ఇతర అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసింది. రాములు భార్య కవిత అయితే రెండుసార్లు విదేశాంగ శాఖను ప్రాధేయపడింది. కానీ, ఫలితం దక్కలేదు. రాములు మృతదేహం స్వదేశానికి తీసుకరాలేని పరిస్థితి తలెత్తింది.
మరోవైపు మృతదేహం పూర్తిగా కుళ్లుపోవడంతో భార్య కవిత అనుమతితో చివరకు సౌదీ అధికారులు అక్కడే ఖననం చేశారు.
సౌదీ అధికారులకు ఫోన్ చేసేందుకు కూడా తన వద్ద డబ్బులు లేదని అలాంటి పరిస్థితిలో తత భర్త మృతదేహాన్ని అక్కడే ఖననం చేసేందుకు ఒప్పుకున్నాని కవిత కన్నీటి పర్యంతం అయింది.
