తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయిన దగ్గరి నుంచి తెలంగాణ బీజేపీకి ఒక నూతన జోష్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఆయన తెరాస పై విరుచుకుపడుతూ దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీల్లో కూడా కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. 

బయటకు బండి సంజయ్ ఈ తరహాలో దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... అంతర్గతంగా పార్టీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టుగా చెబుతున్నారు. 

పార్టీలోని సీనియర్లు బండి సంజయ్ ని నెగలనీయకుండా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది. బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు మారినప్పుడల్లా రాష్ట్ర కమిటీని కూడా మారుస్తారు. కానీ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరిగిన చాలా కలం తరువాత కానీ రాష్ట్ర కార్యవర్గ నియామకం జరగలేదు. 

అప్పుడెప్పుడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తే.... ఆగస్టులో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కాలంలో బండి సంజయ్ కి రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా సమాచారం.

తాజాగా బండి సంజయ్ తన పరిస్థితిని బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. వారు అక్కడ పూర్తిగా పరిస్థితిని సమీక్షించి సొంతగా తనకు అనుకూలమైన టీం ని నియమించుకునేందుకు బండి సంజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాషాయ జెండా పాతాలని యోచిస్తున్న బీజేపీ....రాష్ట్రంలో బండి సంజయ్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని యోచన చేసింది. అందుకు తగ్గట్టుగానే తన సొంత టీం ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చింది. 

ఇక సీనియర్లను బండి సంజయ్ కి ఇబ్బంది కలిగించకుండా... వారి గౌరవానికి భంగం కలిగించకుండా కేంద్ర కమిటీలోకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సీనియర్ లక్ష్మణ్ గారిని ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమిస్తే.... రాష్ట్ర అధ్యక్షా పదవి కోసం పోటీ పడ్డ మరో నేత డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిని చేసారు. 

ఇలా వారికి పదవులను కట్టబెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం కల్పించడంతోపాటుగా బండి సంజయ్ కి ఒకింత వెసులుబాటు కలిగించినట్టు అవుతుంది.