Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. ఈ తరుణంలో కీలక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

పంచాయతీ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. తాజా అప్డేట్ ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో సవరణలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి, ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయనుంది.

ముందుగా ఈ నెల 28వ తేదీన వార్డు, పంచాయతీల వారీగా ఓటర్ జాబితాను ప్రాథమికంగా విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ జాబితాపై 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో (సెప్టెంబర్ 29న ), మండల స్థాయిలో (సెప్టెంబర్ 30 న) రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాపై ఉన్న సమస్యలు, అభ్యంతరాలను పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరగా 2వ తేదీన ఫోటో ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.

తెలంగాణలో సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది. గ్రామ పంచాయతీ కేంద్రాల్లో సర్పంచ్‌ల చెక్ పవర్ పోయి, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన కొనసాగుతోంది. పలు కారణాలతో ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. పదవీకాలం ముగిసిన తర్వాత ఒకటిన్నరేళ్లు గడిచినా, ఎన్నికల ప్రక్రియ ముందుకు రావడం లేదని వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖాలయ్యాయి. ఈ పిటిషన్లు విచారించిన ధర్మాసనం జూన్ 25వ తేదీన తుది తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించమని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేసి, సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

హైకోర్టు సూచనల ప్రకారం.. తొలగించిన ఇబ్బందులు, ఓటర్ల జాబితా సవరణ తరువాత పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి, కానీ కేంద్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.