డేంజర్ జోన్ లో పాలమూరు పిల్లలమర్రి

డేంజర్ జోన్ లో పాలమూరు పిల్లలమర్రి

పాలమూరు జిల్లాకు వన్నెతెచ్చిన పిల్లలమర్రి మహా వృక్షం ప్రమాదం అంచున ఉన్నది. ఈ మహావృక్షంలోని కొమ్మ ఒకటి వేళ్లతో సహా నేలకొరిగింది. దీంతో జిల్లా అధికారులు పాలమూరు పిల్లలమర్రి సందర్శను నిలిపివేశారు. మూడు నెలల పాటు పాలమూరు పిల్లలమర్రి సందర్శన ను నిలిపివేయాలంటూ  మహబూబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది పిల్లలమర్రి సందర్శను నిలిపివేస్తూ ద్వారానికి తాళం వేశారు.


ఈ విషయం తెలియక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాలమూరు పిల్లలమర్రిని సందర్శించకుండా వెనుదిరిగిపోతున్నారు. అయిదు నెలలుగా సందర్శకుల తాకిడి తగ్గి వెలవెల బోతున్న పిల్లలమర్రి పర్యాటక ప్రదేశం తాజాగా సందర్శన నిలిపివేయడంతో పూర్తిగా కళతప్పింది. కాస్తో కూస్తో అన్నట్లు రోజూ వంద మంది వరకైనా పిల్లలమర్రి సందర్శనకు పర్యటకులు వచ్చేవారు. దీంతో పర్యటకశాఖకు కనీసంగా రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేది. ఇపుడీ స్వల్ప ఆదాయం సైతం రాకుండా పోయింది.


ఎక్కడిదక్కడే : పిల్లలమర్రి మహావృక్షంలోని ప్రధాన కొమ్మల్లో ఒకటి వేర్లతో సహా నేలకొరిగి విరిగిన సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా పర్యటకశాఖ యుద్దప్రాతిపదికన సస్యరక్షణతో పాటు ఇతర రక్షణ చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మొన్న సోమవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌ చెట్టును పరిశీలించి వెంటనే వేళ్లు మునిగేలా ఎరువుతో కూడిన ఎర్రమట్టి వేయాలని ఆదేశించారు.

ఎక్కడెక్కడ చెట్టుకు, చెట్టు కొమ్మలకు చెదలు పట్టాయో పరిశీలించి మరోమారు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. చెట్టుకు రోజూ రెండు పూటలు పుష్కలంగా నీళ్లు పట్టాలని, ముఖ్యంగా వూడల వద్ద, కొమ్మలు నేలకు వంగిన చోట, ప్రధాన బుడమల వద్ద పాదులు తీసి నీళ్లు పట్టాలన్నారు. కలెక్టర్‌ ఇంత చెప్పినా మంగళవారం పిల్లలమర్రి వద్ద ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టలేదు. 


ఇదిలా ఉంటే మహా వృక్షం చెదలు సమస్యనుంచి గట్టెక్కే పరిస్థితి కనిపిస్తలేదు. చెదలు నివారణకు ఎంతగా ప్రయత్నించినా... ప్రయత్నాలు అంతగా సఫలమైతున్న దాఖలాలు లేవు. దీంతో వందల ఏండ్లనాటి ఈ మహా వృక్షం డేంజర్ జోన్ లో పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. శాస్త్రీయ, నవీన పద్ధతుల ద్వారా ఈ మర్రి చెట్టును రక్షించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page