Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందుతోంది.. ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ ల‌క్ష్యం.. : సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందుతోందని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (రేసీఆర్) అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఏ పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌కు అయినా యాక్సెస్ కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 

Telangana 's health profile is evolving; The aim is to set up a medical college for every district: CM KCR
Author
First Published Oct 1, 2022, 4:19 PM IST

Telangana health profile: తెలంగాణలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను త్వరలో తయారు చేస్తామని ముఖ్య‌మ‌త్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) అన్నారు. ఇప్ప‌టికే సిరిసిల్ల, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైల‌ట్ ప్రాజెక్టు పూర్త‌యింద‌ని శ‌నివారం నాడు తెలిపారు. వ‌రంగ‌ల్ లోని ప్రతిమ క్యాన్సర్‌ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవంలో ముఖ్య‌మంత్రి పాలుపంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రూపొందించిన అన్ని మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైతే తెలంగాణలో 10 వేలకు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కనీసం ఒక కళాశాల ఉండాలన్నదే త‌మ లక్ష్యమన్నారు.

తెలంగాణ ఆరోగ్య ప్రొఫైల్‌ను రూపొందించడానికి మేము గొప్ప ప్రయత్నం చేసాము. ప్రయోగాత్మకంగా సిరిసిల్ల నియోజకవర్గం, ములుగు నియోజకవర్గాలను చేపట్టి 100 శాతం హెల్త్ ప్రొఫైల్ రూపొందించాం. ప్రతి వ్యక్తికి సంబంధించిన బ్లడ్ గ్రూప్, ఇత‌ర ఆరోగ్య పారామితులు వంటి వివరాలను కంప్యూటరైజ్ చేసినట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఏ పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌కు అయినా యాక్సెస్ కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో 2,800గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 6,800కు చేరిందని ఆయన తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 17కు చేరిందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏ మెడికల్ కాలేజీని కేటాయించనప్పటికీ, మొత్తం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

రాష్ట్రానికి వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తారని, కానీ ఢిల్లీలో ఎక్సలెన్స్‌ అవార్డులు ఇస్తున్నారని కేంద్రమంత్రులపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కొన్ని శక్తులు ప్రజల మదిలో విషపు బీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, ఇది సమాజానికి మంచిది కాదని కేసీఆర్ అన్నారు. అమెరికాలో సాగు భూమి 29 శాతం, చైనాలో 16 శాతం ఉండగా, భారత్‌లో 43 కోట్ల ఎకరాలు అనుకూల వాతావరణ పరిస్థితులు, 70,000 టీఎంసీల నదీ జలాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. 

అన్ని ర‌కాల వ‌స‌తులు, వ‌న‌రులు ఉన్న మన దేశం వంచించ‌బ‌డుతోంది. ప్ర‌పంచానికే అన్నపూర్ణ‌గా ఉన్న భార‌త‌దేశం నేడు వ్య‌వ‌సాయ రంగంలో కుదేల‌వుతుంది. దేశ యువత అప్రమత్తంగా ఉండాలి. ఏమ‌ర‌పాటుతో ఉంటే చాలా దెబ్బ తింటాం : సీఎం కేసీఆర్

 

 నాడు దశాబ్దాలుగా గోసపడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్రంలో దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయాన్ని భారత ఆర్థిక రాజధాని ముంబైతో పోల్చిన ముఖ్యమత్రి కేసీఆర్.. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios