బైక్స్ ను అమాంతం ఎగరేసుకుపోయిన కారు... షాకింగ్ యాక్టిడెంట్ పై సజ్జనార్ రియాక్షన్
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఎండి సజ్జనార్ పోస్ట్ చేసిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ : ఏ తప్పూ లేకున్నా కొన్నిసార్లు ఎదుటివారు తప్పులకు బలవుతుంటారు. ఇలా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తూ రెడ్ సిగ్నల్ పడగానే ఆగడమే వారి తప్పయ్యింది... వెనకనుండి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు సిగ్నల్ వద్ద ఆగిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలీదుగానీ తెలంగాణ ఆర్టిసి ఎండీ విసి సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగానే వైరల్ గా మారింది. రోడ్డుప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సజ్జనార్ యాక్సిడెంట్ వీడియోను పోస్ట్ చేసారు.
''మద్యం మత్తు, అతివేగమే అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. కొందరి నిర్లక్ష్యం ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఎవరో చేసిన తప్పుకు ఇలా అమాయకులు బలవుతున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు'' అంటూ యాక్సిడెంట్ వీడియోను జతచేసి ట్వీట్ చేసారు విసి సజ్జనార్.
అసలు ఆ వీడియోలో ఏముంది...
ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ముగ్గురు బైక్ రైడర్స్ ఆగివుంటారు. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండగా వెనకనుండి ఓ కారు మతిమీరిన వేగంతో దూసుకువస్తుంది. సిగ్నల్ వద్ద ఆగకుండా ముందుకు దూసుకువెళుతూ ఆగివున్న బైక్స్ ను ఢీకొడుతుంది. రెండు బైక్స్ ను అమాంతం ఎగిరి ముందుకు ఎగిరిపడగా మరో బైక్ అక్కడే కిందపడిపోతుంది. ఈ ప్రమాద వీడియో సిగ్నల్ వద్దగల సిసి కెమెరాలో రికార్డయ్యింది.
బైక్ వెళుతున్నవారి తప్పేమీ లేకున్నా కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలవ్వాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని సజ్జనార్ ప్రజలకు తెలియజేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనుకున్నారు. మద్యంమత్తులో లేదా అతివేగంగా వాహనాలు నడపడమే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇలా తాము తప్పుచేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాదు ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.