కరోనా దెబ్బ: తెలంగాణ ఆర్టీసీకి 4 నెలల్లో రూ. 1000 కోట్ల నష్టం
కరోనా తెలంగాణ ఆర్టీసీకి నష్టాలను తెచ్చి పెట్టింది. నాలుగు నెలల్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఆర్టీసీ ప్రయత్నాలను ప్రారంభించింది.
హైదరాబాద్: కరోనా తెలంగాణ ఆర్టీసీకి నష్టాలను తెచ్చి పెట్టింది. నాలుగు నెలల్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఆర్టీసీ ప్రయత్నాలను ప్రారంభించింది.
ప్రతి రోజూ తెలంగాణ ఆర్టీసీకి రూ. 4 కోట్ల మేరకు నష్టం వస్తోంది. ప్రతి రోజూ కనీసం రూ. 5 కోట్ల ఆదాయం వస్తేనే ఆర్టీసీ లాభాల బాటలో నడిచేది. ప్రతి రోజూ కనీసం రూ. 2 కోట్లు కూడ ఆర్టీసీ రావడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలో సీటీ బస్సులను నడపడం లేదు. కరోనా కారణంగా సిటీ బస్సులను నడపకుండా నిలిపివేశారు. జీహెచ్ఎంసీలో 620 ఆర్టీసీ బస్సులను నిలిచిపోయాయి.
జిల్లాల్లో బస్సులు నడిచినా కూడ ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదు.దీంతో ఆదాయం కోసం ఆర్టీసీ ఇతర మార్గాలపై దృష్టి పెట్టింది. కార్గో, కొరియర్, పార్శిల్ సర్వీసులపై ఆర్టీసీ ప్రారంభించింది. ఈ సేవలతో కొంత ఆర్టీసీకి ఆదాయం ప్రారంభమైంది.
also read:గుడ్‌న్యూస్: తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్న కార్గో, కొరియర్ సేవలు
బస్సులు పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితుల్లో లేనందున డ్రైవర్లు, కండక్టర్లను ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. కొరియర్, కార్గో, పార్శిల్ సర్వీసుల సేవలను మార్కెటింగ్ చేసేందుకు గాను డ్రైవర్లు, కండక్టర్ల సేవలను వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేసే స్థానంలో కూడ డ్రైవర్లు, కండక్టర్లకు విధులు కేటాయిస్తారు. మరో వైపు బస్టాండుల వద్ద ట్రాఫిక్ గైడ్స్ గా కూడ విధులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు నెలలుగా బస్సులు తిరగకపోవడంతో సుమారు రూ. 500 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో సుమారు వెయ్యి కోట్లు ఆర్టీసీకి నష్టం వచ్చిందని అంచనా.