గుడ్‌న్యూస్: తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్న కార్గో, కొరియర్ సేవలు
నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు అధికారులు తీసుకొన్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో, కొరియర్, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది.
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు అధికారులు తీసుకొన్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో, కొరియర్, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. కరోనా నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్గో, కొరియర్, పార్శిల్ సేవల ద్వారా ఆదాయాన్ని పొందుతోంది.
ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభయ్యాయి. హైద్రాబాద్ లో మాత్రం సిటీ బస్సులు మాత్రం ప్రారంభించలేదు.
కరోనాకు ముందు ప్రతి రోజూ ఆర్టీసీకి రూ. 5 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా రోజూ కనీసం రూ. 2 కోట్లు మాత్రమే ఆదాయం రావడం కూడ కష్టంగా మారింది. ఈ రూ. 2 కోట్లు ఆర్టీసీ డీజీల్ కు సరిపోవడం లేదు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్:డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్న తెలంగాణ ఆర్టీసీ
దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్గో, కొరియర్, పార్శిల్ సేవలను ఇటీవల ప్రారంభించింది. గతంలో పార్శిల్ సేవలను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చింది ఆర్టీసీ. కానీ ప్రస్తుతం ఈ సేవలనను ఆర్టీసీ చేపట్టింది. ప్రైవేట్ సంస్థలు ఈ సేవలు నిర్వహించే సమయంలో ప్రతి రోజూ ఆర్టీసీకి ఒక్క లక్ష రూపాయాలు మాత్రమే వచ్చేది. కానీ, ప్రస్తుతం రోజూ రూ. 3 లక్షలకు చేరుకొంది.
పార్శిల్, కార్గో, కొరియర్ సేవలకు వస్తోన్న రెస్పాన్స్ తో ఈ సేవలను మరింత విస్తరించాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కార్గో సేవల కోసం 126 పెద్ద బస్సులు ఉన్నాయి. త్వరలోనే మరో 24 పెద్ద బస్సులు రానున్నాయి. ఈ బస్సుల్లో ఒకేసారి 9 టన్నుల సరుకులను సరఫరా చేసే వీలుంది.
ప్రభుత్వ రంగ సంస్థలను కూడ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ లేఖలు రాసింది. ఎఫ్‌సీఐ, రామగుండం ఫెర్టిలైజర్స్, సింగరేణి తదితర సంస్థలకు ఆర్టీసీ తమ సేవలు వినియోగించుకోవాలని లేఖలు రాసింది.
ఈ కామర్స్ సంస్థలతో కూడ ఆర్టీసీ చర్చించనుంది. ఈ కామర్స్ సంస్థలకు సంబంధించిన సరుకులను కూడ ఆర్టీసీ తరలించేందుకు వీలుగా ప్లాన్ చేస్తోంది. గ్రామాలకు కూడ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ సేవలపై సర్పంచ్ లకు అవగాహన కల్పించనుంది.
కండక్టర్ల వద్ద ఉండే టిమ్స్ ద్వారా కూడ ఈ సేవలను వినియోగించుకొనేలా సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు. మరో వైపు సెల్ ఫోన్ ద్వారా కూడ ఈ సేవలను వినియోగించుకొనేలా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.