భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది.  లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ వుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్సాలకు రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.

గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో వున్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ వుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ALso Read: కాజిపేట్-హసన్‌పర్తి మధ్య ప్రమాదకర స్థాయిలో ఓవర్ ఫ్లో.. పలు రైళ్ల రద్దు, దారిమళ్లింపు.. వివరాలు ఇవే..

కాగా.. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతని కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు.. కడెం ప్రాజెక్ట్ మరోసారి అధికారులు, ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన వున్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతోంది.దీంతో వచ్చిన వరదను వచ్చినట్లగా 14 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు.

అయితే ప్రాజెక్ట్‌కు మొత్తం 18 గేట్లు వుండగా.. అందులో నాలుగు మొరాయిస్తున్నాన్నాయి. దీంతో అధికారులు ఆ గేట్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ సాయంతో ఓ గేటును తెరిచారు. మిగిలిన వాటిని కూడా సరిచేసే ప్రయత్నాల్లో వున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్‌కు 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఇప్పటి వరకు 2.4 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. 

YouTube video player