సారాంశం

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. 

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కాజీపేట రైల్వే స్టేషన్‌లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాక్‌లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో రైల్వే స్టేషన్‌ స్విమ్మింగ్ ఫూల్‌ను తలపిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. 

ఇక,  భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. దక్షిణమధ్య రైల్వే
జోన్‌లోని ట్రాక్ ప్రభావిత ప్రాంతాల గురించిన పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణీకుల భద్రత,  రైళ్ల సమాచారాన్ని సకాలంలో తెలియజేయడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ఇక, హసన్‌పర్తి-కాజీపేట మధ్య ప్రమాద స్థాయిలో నీటిమట్టం పొంగిపొర్లడంతో ముందుజాగ్రత్త చర్యగా ఇరువైపులా రైలు రాకపోకలను నిలిపివేసినట్టుగా దక్షిణమధ్య రైల్వే ఈరోజు తెలిపింది.సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్(17012) రైలును గురువారం రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 17233-సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ రైలును గురువారం రోజున, 17234- సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైలును 28వ తేదీన రద్దు  చేస్తున్నట్టుగా ప్రకటించింది. 12761- తిరుపతి-కరీంనగర్  రైలును కాజీపేట ఈ క్యాబిన్-కరీంనగర్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టుగా తెలిపింది. 12762- కరీంనగర్- తిరుపతి రైలును కరీంనగర్-వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టుగా  తెలిపింది. 12757-సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్‌ రైలును గురువారం ఘన్‌పూర్, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టుగా  పేర్కొంది. 12758- సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైలును గురువారం  రోజున సిర్పూర్ కాగజ్‌నగర్-ఘన్‌పూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు  చేసినట్టుగా తెలిపింది. 

 


12649-యశ్వంత్‌‌పూర్-హజ్రత్ నిజాముద్దీన్‌, 22534- యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్‌ రైళ్లను నిజామాబాద్, అకోలా, ఖాండ్వా, ల మీదుగా దారిమళ్లించినట్టుగా దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 12285- సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్‌ రైలును సికింద్రాబాద్-వాడిల మీదుగా దారి మళ్లించినట్టుగా తెలిపింది. అలాగే మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతాలో అందుబాటులో ఉంచారు.