SANGAREDDY: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్నిపోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి టీ హ‌రీష్ రావు అన్నారు. మ‌రో వారంలోనే పోలీసు రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌నీ, దీనికి సిద్ధంగా ఉండాలంటూ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు.  

Police Recruitment Notification: తెలంగాణ ఆర్థిక మంత్రి టీ.హ‌రీష్ రావు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్నిపోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. మ‌రో వారంలోనే పోలీసు రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌నీ, దీనికి నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలంటూ చెప్పారు. వివ‌రాల్లోకెళ్తే.. సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటాన్ చెరువు ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భ‌ర్తీకి సిద్ధ‌మ‌వుతున్న‌ద‌నీ, ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న పోస్టుల‌ను నోటిఫై చేశామ‌ని తెలిపారు. మ‌రో వారంలో పోలీసు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ కానుంద‌నీ, దీనికి నిరుద్యోగులు సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఇత‌ర విభాగాల్లోని అన్ని ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం పెరుగుతున్న ఇంధ‌న‌, ఎల్పీజీ, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై మంత్రి హ‌రీష్ రావు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాష్ట్ర చీఫ్ బండిసంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిల తీరును త‌ప్పుబ‌ట్టారు. తాము ప్ర‌భుత్వ శాఖ‌ల్లోని అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నామ‌నీ, కేంద్రంలో 15 లక్షల పైగా ఖాళీగా ఉన్న‌ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో వారు సమాధానం చెప్పాల‌ని ప్రశ్నించారు. 

రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాష్ట్ర చీఫ్ బండిసంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిలను కేంద్ర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీ గురించి నిరుద్యోగులు ప్ర‌శ్నించాల‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు అంటూ బీజేపీ యాత్ర‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజ‌కీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ బీజీపీ ని నిలదీయండ‌ని సూచించారు. సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను ప్రశ్నించండి అని పిలుపునిచ్చారు. 

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ భ‌ర్తీ విష‌యంలో విద్యార్థులు, నిరుద్యోగుల కోరిక మేరకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడేండ్ల వ‌యోపరిమితి రిలాక్సేషన్ ఇచ్చార‌ని మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించామ‌నీ, దేశంలో ఎక్కడా ఇలా లేద‌ని అన్నారు. బీజేపీని 'భారతీయ ఝూటా పార్టీ'గా అభివర్ణించిన మంత్రి టీ హరీశ్‌రావు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాషాయ పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు శతవిధాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు పాదయాత్రలు చేస్తున్నారన్నార‌ని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదన్నారు. తెలంగాణ 24 గంటల కరెంటు సరఫరా చేస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్నాట‌క‌, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం కరెంటు కోతలు కొనసాగుతున్నాయ‌ని తెలిపారు.