ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికలపై తప్పుడు వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పోలీస్, ప్రత్యేక పోలీసు విభాగాలకు ఈ తరహా వార్తలు పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

కఠినమైన శిక్షలు పడుతున్నప్పటికీ కేటుగాళ్ల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణ విషయానికి వస్తే... సైబర్ పోలీసులు వీటిని ఒక కంట కనిపెడుతూ ఈ తప్పుడు వార్తలు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అయినప్పటికీ కొందరి వైఖరి మారటం లేదు. ఇదిలా ఉంటె తెలంగాణ ఐపీఎస్ అధికారుల బదిలీలు అంటూ గత రెండు రోజులుగా ఓ నకిలీ వార్త పలు వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతుండటం కలకలం రేపింది.

దీనిపై పలువురు మీడియా ప్రతినిధులు ఉన్నతాధికారులను ఆరా తీయగా అది ఫేక్ న్యూస్ అని తేలింది. అంతే కాకుండా ఏకంగా తెలంగాణ డీజీపీయే బదిలీ అయి కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారంటూ తప్పుడు వార్తలు సృష్టించారు కేటుగాళ్లు.

ఇటువంటి ఫేక్ న్యూస్‌లు ఎవరికైనా వస్తే ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే ఫార్వార్డ్ లు కొట్టకూడదని అధికారులు సూచిస్తున్నారు. అలా ఒకరినొకరు పుకార్లను వ్యాపించటం వల్ల సమాజానికి హాని జరుగుతుందని చెబుతున్నారు. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాపింపజేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.