Asianet News TeluguAsianet News Telugu

సంచలన ఆడియో లీక్: కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు

సంచలన ఆడియో లీకైన నేపథ్యంలో తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులకు 24 గంటల లోపల సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.

Telangana PCC serves notice to Huzurabad Congress leader Koushik Reddy
Author
Hyderabad, First Published Jul 12, 2021, 10:31 AM IST

హైదరాబాద్: తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి చెప్పిన మాటల ఆడియో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ పీసీసీ నోటీసులు ఇచ్చింది. వచ్చే 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని పీసీసీ ఆయనను ఆేదశించింది. 

పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డిని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించింది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కౌశిక్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Also Read: నేనే టీఆర్ఎస్ అభ్యర్థిని...: కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ ఆడియో లీక్

దాంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. బిజెపి తరఫున ఆయన హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 

ఇప్పటి వరకు టీఆర్ఎస్ తన హుజూరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ పార్టీ నాయకత్వం అభ్యర్థి వేటలో ఉంది. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన గతంలో కాంగ్రెసు తరఫున ఈటల రాజేందర్ మీద పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహిత బంధువు. 

Follow Us:
Download App:
  • android
  • ios