నేనే టీఆర్ఎస్ అభ్యర్థిని...: కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ ఆడియో లీక్
టీఆర్ఎస్ పార్టీ నుండి హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నట్లు వున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హుజురాబాద్: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో హుజురాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఈటల చేరికతో బిజెపి బలపడగా టీఆర్ఎస్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో బలమైన నాయకున్ని ఈటలకు పోటీగా నిలపాలనుకుంటున్న టీఆర్ఎస్ అదిష్టానం కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా కౌశిక్ రెడ్డి ఆడియో ఒకటి బయటకు వచ్చింది.
కమలాపూర్ మండలానికి చెందిన ఓ యువకుడితో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతోంది. యువకులను తనకు అనుకూలంగా సమీకరించాలని... అవసరమైతే ఒక్కొక్కరికి రూ.5వేల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి సూచించినట్లు సదరు ఆడియోలో వుంది.
read more ఆపరేషన్ హుజురాబాద్: ఈటలపై కౌశిక్ రెడ్డి అస్త్రం, కేటీఆర్ తో మంతనాలు
టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నానని కూడా కౌశిక్ రెడ్డి సదరు యువకుడితో చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్‌లో ఉండాలని కౌశిక్ రెడ్డి సూచించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో రాజకీయంగా సంచలనం రేపుతోంది.
గతంలో హైదరాబాదులో జరిగిన ఓ దశదిన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఒకే టేబుల్ మీద వారు భోజనం చేయడమే కాకుండా మాటాముచ్చట సాగించారు. కేటీఆర్ కారు ఎక్కే ముందు కూడా కౌశిక్ రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో అప్పుడే టీఆర్ఎస్ లో చేరాలంటూ కేటీఆర్ ఆహ్వానించగా కౌశిక్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి బలాన్ని చేకూరుస్తోంది ప్రస్తుత ఆడియో లీక్.