Asianet News TeluguAsianet News Telugu

సిద్ధాంతపు సిగ్గూ శరమూ లేని తెలుగు పార్టీలు

కెసిఆర్ అభిమానులంతా  ఆంధ్రాలో టిఆర్ ఎస్ పెట్టాలని వత్తిడి తీసుకువస్తున్నారట. తెలుగుదేశంతో కలవడానికి అభ్యంతరం లేదంటున్నారు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి.ఇంత కంటే దివాళాకోరు రాజకీయాలుంటాయా అని అడుగుతున్నారు యాక్టివిస్టు శ్రీశైల్ రెడ్డి.ఆంధ్రలో తెరాస, తెలంగాణలో ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే తెలంగానోల్లు దొంగలు, లంగలు, లఫంగలు అని తిడుతరా? కామన్ మినిమమ్ ప్రోగ్రాం గురించి సోనియా-చంద్రబాబు కూర్చుని మాట్లాడుకుంటారా? 

telangana  parties are steeped in ideological bankruptcy

 

చెంగీజ్‌ఖాన్, తామర్లేను, నాదిర్షా, గజనీ, ఘోరి, ఎవడైతేనేమ్? ఒక్కొక్కడు మహా హంతకుడు ...

- శ్రీ శ్రీ

 

ఈ తెలుగు వీరులు ఎవడైతేనేమ్? ఒక్కొక్కడు విలువల హంతకుడు ...

 

1. కేసీఆర్ ఆంధ్రలో పార్టీ పెట్టాలి అని పుంఖానుపుంఖాలుగా ఉత్తరాలు వస్తున్నయి : నమస్తే తెలంగాణ

- ఎట్లా పెడుతరు?

- పోలవరం మండలాల గురించి ఏం మాట్లాడుతరు?

- నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ దోస్తున్నదని ఆంధ్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొడుకు చెపుతడా?

- తెలంగాణ పచ్చిపులుసు పశువుల మూత్రంలా ఉంటదని అమరావతిలో మాట్లాడుతరా మీరు?

- అక్కడ తెరాస, తెలంగాణలో ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే తెలంగానోల్లు దొంగలు, లంగలు, లఫంగలు అని తిడుతరా?

 

తెలంగాణ బిడ్డలూ... పైవేవీ జరగవని గ్యారెంటీ లేదు. ఇది నేను కాదు. నమస్తే తెలంగాణ చెపుతున్నది. వాళ్ళ బాస్ ల ఆమోదం లేకపోతే ఇంత ధైర్యం ఆ పత్రిక చేయదు. 

 

తెలుసుకోండి. కేసీఆర్ అండ్ కో ఎంతటి ద్రోహులో! 

 

ఆంధ్ర తమ్ములూ... ఈ దుర్మార్గాన్ని సాగనివ్వకండి. ఇరుగు పొరుగు అయిన మనకెపుడూ పొలంగట్టు తగాదాలు ఉంటాయి. తప్పదు. వీలైనంత సామరస్యంగా, చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతే కాని, నీచాతినీచులను చేరదీయవద్దు.

 

2. తెదేపా-కాంగ్రెస్ పొత్తు అసంభవం ఏమీ కాదు : జైపాల్ రెడ్డి-రేవంత్ రెడ్డి 

- మెడకాయ మీద తలకాయ ఉన్నవాళ్ల మాటలేనా ఇవి ? 

- ఎట్లా పెట్టుకుంటారు పొత్తు? ఆంధ్రలో కూడా కాంగ్రెస్-తెదేపా కలుస్తాయా? 

- అధికారం కోసం ఏ గడ్డి అయినా కరుస్తారా? 

- భూసేకరణ చట్టం 2013 అతి గొప్పది అని అందరూ అనుకుంటూంటే, దానికి తూట్లు పొడిచే పార్టీలతో ఎలా కలుస్తారు?

- కామన్ మినిమమ్ ప్రోగ్రాం గురించి సోనియా-చంద్రబాబు కూర్చుని మాట్లాడుకుంటారా? 

- 'అన్యాయ రాష్ట్ర విభజన' గురించి ఇంక జీవితంలో మాట్లాడరా బాబు? 

 

తమ నాయకుల ప్రకటనలతో ఊగిపోతున్న యువత తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.  అభివృద్ధి, సంక్షేమం, వికాసం, ప్రాధాన్య రంగాలు, సైద్ధాంతిక అంశాలు... ఇవేవీ లేకుండా తమ కులం నాయకుడి ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తే చాలా?  పాలకుడు మారితే సరిపోతుందా? పాలన మారనవసరం లేదా? 

 

షేం. షేం. 

 

సమాజం మేలును కోరే యువకులు , ఈ పచ్చి అవకాశవాద పార్టీలను, నాయకుల దోరణి జాగ్రత్తగా గమనించాలి. ప్రజా జీవితాలు విధ్వంసంలో  మీరూ భాగస్వాములు  కావద్దు, మీరు విధ్వంసపు బారిన పడతారు. మీ ఇరుగుపొరుగు, మీ చుట్టాలు, మీ శ్రేయోభిలాషులు, అరకొర జీతాలతో బతుకీడుస్తున్న మీ బంధుమిత్రులు, అందరూ 'మారని పాలన' కు బలౌతారు. 

 

అక్కడా, ఇక్కడా... ఎక్కడైనా... మార్పు కోసం పనిచేయండి. అలాంటి వారికి తోడ్పాటు యివ్వండి. దేశంలోనే నగుబాటు అవుతున్న తెలుగు ప్రజలను చరిత్రహీనులను చేసే గారడీల బారిన పడకండి. 

 

లోతుగా ఆలోచించండి. 

 

(ఇందులో వ్యక్త పరిచినవన్నీ రచయిత సొంత అభిప్రాయలు. వీటి మీద చర్చకు ఆహ్వానం)

Follow Us:
Download App:
  • android
  • ios